Saturday, January 16, 2016

తృణీకరించొద్దు.. తినండి 11-12-11 - సాక్షి సెంట్రల్ డెస్క్

తృణీకరించొద్దు.. తినండి





తృణధాన్యాలే ఆరోగ్యానికి రక్ష అంటున్న వైద్యులు
ఆహారంలో వీటి వినియోగం పెంచాలంటున్న పౌష్టికాహార నిపుణులు
జొన్న, రాగులు, సజ్జలతో లైఫ్‌స్టైల్ వ్యాధులకు చెక్
వీటిని పీడీఎస్ ద్వారా పంపిణీ చేయాలంటూ జాతీయ ఆహార భద్రత ముసాయిదా బిల్లు సిఫార్సు

జొన్న కలి, జొన్న అంబలి, జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలే తప్ప.. సున్నసుమీ సన్నన్నము..
- పల్నాటి సీమ దుస్థితిని వివరిస్తూ మహాకవి శ్రీనాథుడు చెప్పిన ప్రసిద్ధ చాటువు ఇదీ.. అక్కడ సన్న అన్నమే దొరకదని.. చివరికి జొన్నల్లాంటివే దిక్కు అని వాపోయాడు. అంతేకాదు.. ‘పుల్ల సరోజ నేత్ర..’ అనే మరో చాటువులో రాక్షసి పూతన విషపు పాలు తాగి గొప్పలు చెప్పడం కాదు.. దమ్ముంటే.. జొన్న కూడు తిని చూడు.. ముద్ద దిగదు అంటూ శ్రీకృష్ణుడికి సవాలూ విసిరాడు. ఆనాడు శ్రీనాథుడు ఏమన్నా.. ఇప్పుడు మాత్రం జొన్న, సజ్జ, రాగులు వంటి తృణధాన్యాలే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అంటున్నారు వైద్యులు, పౌష్టికాహార నిపుణులు. మన వంటింటి నుంచి ఎప్పుడో సాగనంపేసిన ఈ తృణధాన్యాలకు వెంటనే వెల్‌కమ్ చెప్పమని చెబుతున్నారు. సన్నన్నం అంటూ పరుగులు తీయడం మానాలని, పాలిష్‌డ్ బియ్యంలో పౌష్టిక విలువలూ కూడా పాలిష్ అయిపోతాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తృణధాన్యాల సాగు పెంచాలని, మన ఆరోగ్యం మహాభాగ్యంగా ఉండాలంటే ఆహారంలో వీటి వినియోగం పెంచాలని సిఫార్సు చేస్తున్నారు.

చిరు ధాన్యంపై చిన్నచూపొద్దు: ప్రస్తుతం మన ఆహార అలవాట్ల వల్ల దేశంలో జీవనశైలి వ ల్ల వచ్చే వ్యాధుల(లైఫ్ స్టైల్ డిసీజెస్) తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య లెక్కల ప్రకారం మన దేశం 5.8 కోట్ల మంది మధుమేహ రోగులతో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. ఇటు చిన్న పిల్లలనూ టైప్-2 మధుమేహం వంటివి చుట్టుముట్టేస్తున్నాయి. అందుకే.. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అంతర్జాతీయ ఉష్ణ మండల ప్రాంతీయ పంటల పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) కూడా లైఫ్‌స్టైల్ డిసీజెస్‌ను నియంత్రించేందుకు.. భారతదేశం జొన్నలు వంటి తృణధాన్యాల సాగు వైపు వెంటనే మళ్లాలని పిలుపునిచ్చింది. ఎందుకంటే జొన్నలు, రాగులు, సజ్జలు వంటికి మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. మధుమేహాన్నీ అదుపులో ఉంచుతాయి. 100 గ్రాముల రాగుల్లో 350 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. బియ్యం, గోధుమల్లో ఇది కేవలం 50 ఎం.జీ ఉంటుంది. బార్లీలో ఎనిమిది అతి ముఖ్యమైన అమినో యాసిడ్లు ఉంటాయి. ఇందులో మెగీ్నిషియం, పోటాిషియం, సెలెనియం, ఫాస్పరస్ ఉంటాయి. మానవుల్లో కొన్ని రకాల కేన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో జొన్న పాత్ర ఎనలేనిది. బరువు తగ్గాలన్నా.. జొన్న కూడే బెటర్.

ఇప్పుడిప్పుడే: తృణధాన్యాల్లోని పౌష్టిక విలువలను గుర్తించే విదేశాల్లోని మనవాళ్లు అక్కడ ఎప్పుడు రెస్టారెంట్లకు వెళ్లినా.. వీటితో చేసిన వంటకాలనే అడిగితెప్పించుకుంటుంటే.. మనమేమో ఇక్కడ మూతి తిప్పేసుకుంటున్నాం. చిరుధాన్యాల్లో ఉండే పౌష్టిక విలువలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, నెమ్మది నెమ్మదిగా ఇక్కడా చిరు ధాన్యాల్లోని పౌష్టిక విలువలపై అవగాహన పెరుగుతోంది. జొన్న రొట్టెలు, రాగి సంకటి వంటివి మన డైనింగ్ టేబుళ్ల మీద సందడి చేస్తున్నాయి. స్టార్ హోటళ్లలో అయితే.. వీటితో కొత్త రకాల వంటకాలు చేసేస్తున్నారు. రాగి పాన్‌కేకులు, జొన్న మఫిన్స్.. ఇలా చెప్పాలంటే బోలెడు. ఇక రాగి బిస్కట్లని, మల్టీగ్రెయిన్ ఆటా అని మార్కెట్లోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే, ఇది కొంతమందికే పరిమితమవుతోందని.. దీన్ని మరింత విస్తరించాల్సి ఉందని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. ఇటు ప్రభుత్వమూ వీటి విలువను గుర్తించింది. అందుకే.. జాతీయ ఆహార భద్రత బిల్లు-2011 ముసాయిదా కూడా వీటిని పీడీఎస్ ద్వారా పంపిణీ చేయాలని చెప్పింది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. త్వరలో రేషన్ షాపుల ద్వారా తృణధాన్యాల సరఫరా మొదలవుతుంది.
- సాక్షి సెంట్రల్ డెస్క్

No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...