Saturday, November 4, 2017

Fwd: మిత్రలాభము ...


---------- Forwarded message ----------
From: Vikram Kumar <vikram2036@gmail.com>
Date: 2016-05-09 11:36 GMT+05:30
Subject: మిత్రలాభము ...
To:


విక్రమ్ భయ్యా కు స్నేహితుడైన 'అనిల్ (పీహెచ్డీ చేస్తున్నాడు)' సిఫారసు చేసినవి... 
http://electrical-engineering-portal.com/download-center/electrical-software



----------------

విక్రమ్ భయ్యా 2015 దినపత్రికలో చదివినది... 

మాతృమూర్తి... మొదటి గురువు

ఆండీస్ పర్వత ప్రాంతాల్లో రెండు గిరిజన తెగల మధ్య ఎప్పుడూ ఆధిపత్యపోరు సాగుతూ ఉండేది. ఒక తెగ పర్వత శ్రేణుల్లో కింది ప్రాంతంలో నివసిస్తే.. మరో తెగ ఎగువ ప్రాంతాల్లో నివసించేది. ఒక రోజు ఎగువ ప్రాంతం వారు కింది ప్రాంతంపై దాడిచేసి సంపదను దోచుకోవడమే కాకుండా ఒక చంటిపాపను కూడా ఎత్తుకుపోయారు. ఆ చంటిపాపను వెనక్కి తేవడానికి దిగువ ప్రాంతానికి చెందిన సమర్థులైన 50 మంది యువకుల బృందం బయలు దేరింది. దాదాపు వారం శ్రమించినప్పటికీ ఎక్కాల్సిన ఎత్తులో సగం కూడా ఎక్కలేకపోయింది. చంటిబిడ్డను తేవటం కాదు కదా పర్వత శిఖర ప్రాంతానికే చేరలేమనే నిర్ణయానికి వచ్చి నిరాశతో, నిస్సహాయ స్థితిలో వెనుతిరిగి పోవటానికి సిద్ధమైంది.

అంతలో ఒక స్త్రీ తన వీపునకు ఒక బిడ్డను కట్టుకుని పై నుంచి దిగుతోంది. కాళ్లు, మిగతా శరీరం అంతా గాయాలతో రక్తం కారుతున్నా.. లెక్క చేయడం లేదు. బలవంతులమైన యాభై మందిమి కనీసం పర్వత శిఖరాన్నైనా చేరలేకపోయాం. నీకు ఇది ఎలా సాధ్యమైంది. అని ఆమెను అడిగారు. దీనికి ఎంతో సహజంగా ఇలా సమాధానమిచ్చింది. 

''నేను ఈ బిడ్డ అమ్మను. 
బిడ్డ బోసినవ్వుల్లో ఉన్న అమృతానందాన్ని అనుభవించే నాకు... ఇది ఏ మాత్రం కష్టం అనిపించలేదు. అయినా ఈ బిడ్డను నవమాసాలు మోసి పెంచింది నేను కాబట్టి.. నా బిడ్డ నా ఒడిలో చేరేంత వరకూ నాకు మరో ఆలోచన లేదు. మీరు అలా కాదు కదా''. అని అక్కడ నుంచి వెళ్లిపోయింది. కొద్దికాలం 
కిందటే జరిగిన ఆ సంఘటన వింటుంటే..

అమ్మ రూపమ్ము నిచ్చిన అమృతమూర్తి
దివినమృతము కలదో లేదో తేల్చజాల
అమృతమను మాటకిల అర్థమమ్మ అనుటె
అమ్మ శబ్దమ్ము నకు సాటి అమ్మ యొకటె

(అమ్మ మనకు రూపాన్నిచ్చిన అమృతమూర్తి. ఈ భూమ్మీద అమృతముందో లేదో చెప్పలేను కానీ అమృతమనే మాటకు ఇక్కడ అర్థం అమ్మ అనటమే. అమ్మకు సాటి అమ్మే) అన్న మీగడ రామలింగస్వామి వారి మాటలు స్ఫురణకు వస్తాయి.

స్వర్గంలో ఒకసారి ఆసక్తికర సంభాషణ జరిగింది. అప్పుడే ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన భగవంతుడ్ని ఇలా అడిగింది. ''అందరూ అనుకుంటున్నారు నీవు నన్ను  భూమి మీదకు పంపిస్తున్నావట కదా! ఇంత చిన్నదాన్ని, అసహాయురాల్ని అక్కడికి వెళ్లి నేను ఎలా జీవించగలను? దానికి భగవంతుడు చిరునవ్వుతో ''నీకోసం ఓ దేవత భూమ్మీద ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా...నీకోసం పాడుతుంది. నిన్ను చూసి నవ్వుకుని మురిసిపోతుంది. నిన్ను ఆనందంగా ఉంచుతుంది'' అన్నాడు. మరి నాకు అక్కడ భాష తెలియదు కదా మాటలు ఎలా అర్థం చేసుకోను? నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు? అని అడిగింది ఆ పాప. నువ్వు మాట్లాడకపోయినా నీకేం కావాలో ఆ దేవతకన్నీ తెలుసు. అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది. ఆ దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా నిన్ను రక్షిస్తుంది అన్నాడు భగవంతుడు. మరి నేనెప్పుడైనా నీతో మాట్లాడలనుకుంటే ఏం చేయను? అనడిగింది పాప. నీ దేవత నీరెండు చేతులూ ఒక చోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్థించాలో చెబుతుంది. నీలోనే ఉండే నన్ను ఎలా చూడాలో చెబుతుంది అన్నాడు.

ఆ క్షణంలో స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది. భూలోకం నుంచి వేదనాధ్వనులు వినిపించాయి. అప్పుడు ఆ చిన్నారి పాప తొందరపడుతూ... నా దేవత పేరేంటి అని అడిగింది. నీ దేవత ''అమ్మ'' అని సమాధానమిచ్చాడు భగవంతుడు.

నాస్తి మాతృ సమం దైవం
నాస్తి మాతృ సమః పూజ్యో
నాస్తి మాతృ సమో బంధు
నాస్తి మాతృ సమోగురుః

(అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు. తల్లిని మించిన బంధువులుగానీ, గురువులు కానీ లేరు).

ఆకలేసినా.. ఆనందం వేసినా, దిగులేసినా దుఃఖం ముంచు కొచ్చినా, పిల్లలకైనా, పిల్లలను కన్న తల్లిదండ్రులకైనా గుర్తొచ్చే పదం అమ్మ. తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ.

సరస్వతీ తీరం
ఆరోగ్యకరమైన గృహ వాతావరణంలో స్థిరమైన సంకల్పంతో చదువు సాగడానికి తల్లి పాత్ర అసామాన్యం. చదువులంటే 'ఒలకపోసి ఎత్తుకోవడమే' (చదువు కోసం ఎంత ఖర్చు పెట్టినా అంతకు అంత తిరిగివస్తుంది) అనే నానుడి ఈ లోకంలో ఉంది. ఈ విషయం మా అమ్మ లీలా రత్నకుమారికి తెలుసో లేదో కానీ, బాగా చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉందనే బీజ భావం తన పిల్లలందరిలోను నాటగలిగింది. నీవే దిక్కని దైవాన్ని ప్రాధేయపడక పోయినా మనకి మనం సహాయం చేసుకుంటుంటే దైవం తప్పక అనుకూలిస్తాడనే నమ్మకం అమ్మ మాటల్లో ధ్వనించేది. అందుకే పదో తరగతి కంటే ఎక్కువ చదవలేకపోయినా పిల్లలందర్నీ ఉన్నత చదువులు చదివించాలనే తపన అమ్మలో బలీయంగా ఉండేది. నాకు ప్రథమ గురువు కూడా అమ్మే. ఆరేళ్ల వరకూ అ, ఆ లు కూడా రాకపోయినా అమ్మ ఆందోళన చెందలేదు. ఏదో ఒక కిడ్స్ కార్నర్‌లో చేర్చి తన బాధ్యత అయిపోయిందని చేతులు దులుపుకోలేదు. నీకు అక్షరాలు తొందరగానే వస్తాయని ప్రోత్సహిస్తూ రాయించేది. అమ్మ అన్నట్టుగానే ఆరేళ్లకు అ, ఆ లు వచ్చిన తర్వాత మిగిలిన అక్షరాలు రావడానికి ఆరు వారాలు కూడా పట్టలేదు. ఒక పని చేయగలవు అని ప్రాథమిక విశ్వాసం కలిగించేది తల్లే. ఎందుకంటే చదువంటే నేర్చుకోవడం. ఈ నేర్చుకోవడం అనేది ఎలాంటి ఒత్తిడి లేకుండా సహజంగా జరగాలి.
 
బిడ్డ పుట్టినప్పటి నుంచే ఈ నేర్చుకోవడమనే ప్రక్రియ ప్రారంభమౌతుంది. దాన్ని చదువు వేగవంతం చేస్తుంది. బలవంతం చేస్తే మేధస్సుపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో పిల్లల్లో సహజంగా ఉండే సృజనాత్మక శక్తి తగ్గిపోతుంది. 3వ తరగతిలో భాగహారాలు రాక ఏడుస్తుంటే.. అమ్మ ఆసక్తికరంగా చెప్పిన లెక్క, లెక్కలపై ఆసక్తి కలిగించడమే కాకుండా భయాన్ని కూడా పోగొట్టింది. తర్వాత లెక్కల్లో ఏనాడూ ఇబ్బంది పడలేదు. అదే అలవాటుతో ఎలాంటి సమస్యలనైనా చిత్రాలుగా ఊహించుకొని పరిష్కరించుకునే అలవాటు ఆరంభమైంది. విశ్వాసం, ఆసక్తి ఉంటే ఏం చదివినా శ్రమ అనిపించదు. ఏదైనా ఊరు వెళ్లాల్సివస్తే మా చదువులకు ఇబ్బంది కలుగుతుందని ఊర్లకి వెళ్లకుండా మానుకున్న సందర్భాలు అనేకం. పరీక్షల సమయాల్లోనైతే సొంత ఊర్లో కూడా పేరంటాళ్లకు, పంక్షన్‌లకు అమ్మ వెళ్లేది కాదు. ఈ విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా తల్లి అంటే  త్యాగానికి పర్యాయపదం అనే భావన కలుగుతుంది. పిల్లల చదువుల ఓడకు లంగరులా ఉండి, ఆ ఓడను సరస్వతీ తీరానికి చేర్చడానికి అమ్మ పడ్డ శ్రమ జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడల్లా... 

తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా 
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!

ఓ చదువుల తల్లీ నిన్ను తలచుకొని పుస్తకము చేపట్టాను. నీవు నన్ను ఆవహించి నాతో మంచి గంధం లాంటి మాటలను, వినసొంపైన వాక్కులను పలికింప చేయవా! అన్న చదువుల దైవమైన సరస్వతీ దేవి స్తుతి స్ఫురణకు వచ్చి కళ్లు చెమరుస్తాయి. కన్నతల్లి కంటే ఘన దైవమింకేది. 
ఆర్థిక క్రమశిక్షణ:
మనలోని చాలా కుటుంబాల్లో వనరులు పరిమితమే. అయితే ఆ పరిమిత వనరులను కుటుంబ శ్రేయస్సు కోసం ప్రణాళికా బద్ధంగా వినియోగించుకోగలిగే నేర్పే ఆ కుటుంబం సురక్షిత గమ్యానికి చేరుకోవడానికి తోడ్పడుతుంది. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం, వాటితోనే అందరి అవసరాలను సమాధానపరచడం, ప్రతి కుటుంబానికీ ఎంతో ముఖ్యం. వస్తువులను, డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలనే శ్రద్ధ అమ్మలో అనుక్షణం కనిపించేది.  అవసరం, ఆలోచన లేకుండా దుబారాగా ఖర్చు పెడితే దుస్థితికి దిగజారుతామనే ఆమె హెచ్చరిక ఏ పని చేసినా వెంటే ఉండి నడిపించేది. ఉన్న వనరులతో సర్దుకొని జీవించడం వల్ల ఎవరో ఏదో చేయలేదనే భావన కానీ, ప్రతి దానికీ ఫిర్యాదు చేసే గుణం కానీ, అనాయాచితంగా ఆశించి భంగపడటం లాంటివి కానీ ఎప్పుడూ దరి చేరలేదు. 

ఆదాయమెంత? అవసరాలేంటి అని బేరీజు వేసుకుంటూ, ప్రతి పైసానూ సక్రమంగా వినియోగించుకుంటూ, అందులోనే కొంత క్రమం తప్పకుండా పొదుపు చేసుకుంటూ, భవిష్యత్తును సురక్షితంగా మలచుకోవడం, అమ్మ నుంచి అలవర్చుకున్నవే. జాగ్రత్త, పొదుపు అనేవి ప్రతి బిడ్డ అమ్మ దగ్గర నుంచి నేర్చుకోగలిగే సహజ విద్యలు. ఎందుకంటే అయిదుగురికి అన్నం పెట్టాల్సివచ్చి నలుగురికీ సరిపడా అన్నం మాత్రం పాత్రలో ఉన్నప్పుడు తనకు ఆకలి లేదనే సహజ గాంభీర్యం, ప్రతి తల్లిలోనూ మనకు కన్పిస్తుందంటాడు ఎమర్సన్. ఇలా బాల్యంలోనే ఆర్థిక క్రమశిక్షణ అలవడితేనే వ్యక్తి స్థాయిలోనే కాక, రాష్ట్ర, దేశస్థాయిలో కూడా బడ్జెట్లు గాడి తప్పవు.

శ్రమయేవ జయతే:
యువతలో అశాంతి పెరగడానికి ఒక ప్రధాన కారణం చిన్నప్పటి నుంచి వారిలో శ్రమ పట్ల గౌరవం (Dignity of labour) అలవడకపోవడమే అంటారు నెల్సన్ మండేలా. చిన్నప్పటి నుంచి పిల్లలకు కలల సౌధం చూపిస్తాం కానీ, శ్రమించడం, శ్రమను గౌరవించడం ఎలాగో నేర్పం. అందుకే చదువుకున్న యువత మట్టిపనో, పొలంపనో, మొక్కల పనో అంటే విముఖత చూపుతారు. ఖాళీ మెదడు దెయ్యాల ఇల్లు (Idle brain is devil's workshop). సోమరితనం అమ్మ నిఘంటువులో లేని మాట. లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటుంది. ఏ సేవకుల మీదా ఆధారపడకుండా, ఇంటి పనులన్నీ తనే చేసుకోవడం, ప్రదర్శన కోసమో, విలాసాల కోసమో కాక అత్యవసరార్థం మాత్రమే వస్తువులను కొనడం, ఏ కాలంలో పెరిగే కూరగాయలు, ఆ కాలంలో పండించుకోవడం, నడవగలిగే ఎంత దూరాన్నైనా ఏ వాహన సహాయం లేకుండా నడవడం.. నడిచి వెళ్తే ఎవరో ఏదో అనుకుంటారనే న్యూనతా భావం లేకపోవడం లాంటి అలవాట్లు వల్ల జీవన విధానంలో ఒక విధమైన ఆర్థిక, మానసిక స్వావలంబన ఏర్పడటానికి దోహదం చేసింది. ఆచార్య గోపీ అన్నట్లు...

ఆమె లేచి సూర్యుడిని లేపాలిక
అతణ్ణి నిద్రపుచ్చాకే ఆమెకు విశ్రాంతి.

ఇలా ఏర్పడ్డ అలవాట్లతో వచ్చే ఆత్మ విశ్వాసం జీవితాంతం కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.

తల్లి'రాత': పరీక్షల్లో మనం ఏం రాసినా చదివేవారికి అర్థమైతేనే దాని ఫలితం బాగుంటుంది. అమ్మ రాసే ఉత్తరాలు కూర్చిన ముత్యాల వరుసలుగా ఉండేవి. చేతిరాత అంత కూర్చినట్టుగా ఉంటే చదివేవారికి ఆహ్లాదంగా ఉంటుందన్న విషయం, ప్రథమంగా అనుభవమైంది అప్పుడే. బహుశా ఆ అనుభవమే తర్వాతి రోజుల్లో అందమైన చేతిరాతను కాకపోయినా, ఇతరులు చదివి అర్థం చేసుకోగలిగే చేతిరాతను అలవర్చుకునేలా చేసింది. పోటీ పరీక్షల్లో చేతిరాత అర్థమయ్యేలా లేకపోవడం వల్ల తలరాత తారుమారైన ప్రతిభాశాలులైన మిత్రులు ఎందరో.

విజయం వెనుక పరాజయం వెనుక
విద్యాభ్యాసం ప్రారంభమైనప్పటినుంచీ కోరుకున్న లక్ష్యాన్ని సాధించే వరకూ ప్రతి విద్యార్థి జయాపజయాలు వెన్నంటే ఉంటాయి. విద్యార్థి చేసే పరిశ్రమకు వెన్నంటి నిలిచే తల్లి సహకారం ఉంటే ఉత్సాహం ద్విగుణీకృతమవుతుంది. ఎలాంటి పరిస్థితిల్లోనైనా బెదురు లేకుండా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం, ఆ నిర్ణయాన్ని అమలు చేయాలనే తపనతో కార్యాచరణకు దిగడం అమ్మ నుంచి నేర్చుకున్నవే. ఊహల పల్లకిలో తేలిపోవడం కానీ, భవిష్యత్తును అంధకారంగా ఊహించుకుని బెంబే లెత్తిపోవడం కానీ అమ్మకు తెలియవు. వర్తమానంలో మనం చేసే పనే భవిష్యత్తుగా అందుతుందనే తత్వం "The best way to predict future is to create it' (భవిష్యత్తును ఊహించగలిగే అత్యుత్తమ మార్గం దాన్ని సృష్టించడమే) అన్న ఆంగ్ల సామెతను జ్ఞప్తికి తేవడమే కాక జీవితాన్ని వాస్తవికంగా జీవింప చేసేలా చేసింది. బాల్యంలో ఒకసారి పరీక్షల్లో సరిగా రాసినా ఆశించిన మార్కులు రాక బాధపడుతుంటే నా బిడ్డ పేపర్‌ను సరిగా మూల్యాంకనం చేయించి న్యాయం చేయమని ప్రధానోపాధ్యాయుడికి ఆమె ఆర్జీ రాసిన ఘటన మరువలేనిది. పరిశ్రమ చేసే విద్యార్థికి అలాంటి ప్రోత్సాహం లక్ష్యసాధనకు మరింత పురి గొలుపుతుంది. అలాగే ఐఏఎస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకూ వచ్చి సఫలం కాలేకపోతే రావాల్సి ఉంటే వస్తుంది లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు అని సర్ది చెప్పింది. అంతేకాని మంచి ర్యాంకులు వచ్చినవారితో పోల్చి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం కానీ, అసహనాన్ని ప్రదర్శించడం కానీ చేయలేదు. అమ్మ నుంచి అలాంటి స్వాంతన లభిస్తే పరాజయ గాయం త్వరగా మానటమే కాక లక్ష్యసాధనకు పునరంకితమవడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఇలా ఎన్నో సందర్భాల్లో అమ్మల commonsenseను జీవిత నావకు చుక్కాణిలా ఉపయోగించుకొని కృతార్థులైనవారు ఎందరో. అందుకే ...

 తల్లిని ప్రథమ గురువు అన్నారు. అందరికంటే మిన్నగా గౌరవించదగింది తల్లియే.

ఆత్మీయ బంధాలు: 
పారిశ్రామిక విప్లవం బాగా వేళ్లూనుకున్న ప్రస్తుత తరుణంలో సమాజంలో వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సంబంధాలే కానీ, అనురాగ బంధాలు మృగ్యమై పోతున్నాయనే వాస్తవిక విమర్శ ఉంది. వ్యక్తి ఆత్మీయతా Balanceను చూసి కాక, ఆర్థిక Balanceను చూసి సంబంధాలు ఏర్పరచుకునే ఈ వ్యాపార సమయంలో, ఈ భూమి మీద ప్రాణంతో పడ్డప్పటి నుంచీ, ప్రాణం పోయి భూమిలో కలిసేవరకూ, ప్రకృతి సిద్ధమైన అమ్మ ఆదరణ  తప్ప మరేదీ ప్రపంచంలో ఊరికే లభించదు.  కష్టం, సుఖం చెప్పుకోవడానికి తోబుట్టువులు ఉండాలి. ఒకరికి ఒకరు తోడుగా, ఆపత్కాలంలో నీడగా, ఆత్మీయతా అనురాగాలతో ఉండండి అనేది అమ్మ. చిన్న వయసులో ఆ మాటల సారాంశం బోధపడకపోయినా, వయసు పెరిగేకొద్దీ ఆ మాటల్లోని wisdom క్రమంగా అర్థమవుతూ వచ్చింది. తోడుగా అన్నలు, అక్కలూ ఉన్నారనే ఆలోచనే కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. నిబ్బరం కోల్పోయే దశలో.. సామాజిక బంధాలు ఆర్థిక శాస్త్ర కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రస్తుత విషమ సమయంలో ప్రతి ఒక్కరికీ అక్కరకు వచ్చేది అమ్మ నేర్పిన ఆత్మీయ శాస్త్రమే. 

త్యాగరాజ స్వామి అన్నట్లు -
(ఓ తల్లి నీవు నాతో ఉండగా నాకు వేరొక చింతెందుకు?)

సర్వసంగపరిత్యాగైనా, దేశాధినేత అయినా అమ్మకి బిడ్డే. అందుకే సర్వం త్యజించి సన్యాసి అయిన శంకరాచార్యుడు తల్లి పరమపదించిందని తెలిసిన తర్వాత తల్లి దగ్గరకు తిరిగి వచ్చి సర్వక్రియలూ నిర్వహిస్తాడు. రామాయణంలో విభీషణుడికి లంకాధీశుడిగా పట్టాభిషేకం జరిగింది. రామ లక్ష్మణులకు లంకనంతా తిప్పి చూపిస్తున్న తరుణంలో పూర్తిగా బంగారంతో కట్టిన లంకను చూసి లక్ష్మణుడు సంభ్రమాశ్ఛర్యాలకు లోనవుతూ, లంక స్వర్గంలా ఉందన్నాడు. అప్పుడు రాముడు ఇలా అంటాడు...

అపిస్వర్ణమయీ లంకా న మే  రోచతి 
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ


లంక బంగారు మయమైనా నాకు మాత్రం రుచించదు. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి, జన్మించిన చోటు స్వర్గంలోనూ దొరకవు. ఎంత అక్షరసత్యం ఈ మాటలు - ఎంత అజరామరం ఈ భావం. అందుకే మానవాళి పెదాలపై కదలాడే అత్యంత మధురమైన పదం ''అమ్మ'' అంటాడు ఖలీల్ జీబ్రా. త్యాగానికీ అర్థం వెతుక్కునేవారు చూడాల్సింది నిఘంటువు కాదు అమ్మ ముఖం అంటాడు ఓ సుకవి! ''తల్లి హృదయమే మానవాళిని నడిపించే అతిపెద్ద విశ్వవిద్యాలయం. నా తల్లి ప్రార్థనలు, దీవెనలు సదా నన్ను వెంట ఉండి నడిపించాయి, రక్షించాయి'' అంటారు అబ్రహం లింకన్. ''భవిష్యత్తును గురించి సరిగ్గా చెప్పగలిగిందే అమ్మే. ఎందుకంటే మానవాళి భవిష్యత్తుకు అమ్మే మూలం కాబట్టి.'' అంటాడు మాక్సిమ్ గోర్కీ. ''జన్నత్ మాకీ కదమోం కే నీచే హై''(స్వర్గం ఎక్కడో లేదు అమ్మ పాదాల దగ్గరే ఉంది) అంటాడో ప్రవక్త. ఏది ఏమైనా కావచ్చు కానీ జీవితాంతం మారకుండా ఉండేది నిస్వార్థమైన అమ్మ అనురాగమే. అలాంటి అనురాగ మూర్తుల ఒడిలో, లాలనలో నేర్చుకోగలిగే విలువైన పాఠాలు ఏ మేనేజ్‌మెంట్ స్కూల్లోనూ, ఏ వ్యక్తిత్వ వికాస కోర్సులోనూ లభ్యం కావు. ఎందుకంటే అవి సహజంగా జీవనయానంలో లభ్యమయ్యేవి కాబట్టి. ప్రపంచాన్ని ఆర్థికమాంద్యం పట్టి కుదిపేస్తున్న ఈ సమయంలో ప్రతి కంపెనీ యజమానీ తన ఉద్యోగుల్లో జీవితంలో తల్లి దగ్గర నేర్చుకొనే సహజ విలువలైన  పొదుపు, పరిశ్రమ, త్యాగాలను ఆశిస్తున్నారు. ప్రతి విద్యార్థికీ, ప్రతి బిడ్డకూ వ్యక్తిత్వ నిర్మాణంలో అమ్మ పాత్ర శరీరంలో ప్రవహించే రక్తంలాగా అంతర్లీనమైంది. అత్యంత మహత్తరమైంది. మనం ఆమె నమ్మకాన్ని వమ్ముచేసినా ఆమె మనపై నమ్మకాన్ని వదులుకోదు.

మాతృదేవోభవ!!

ఆకలేసినా.. ఆనందం వేసినా, దిగులేసినా దుఃఖం ముంచుకొచ్చినా, పిల్లలకైనా, పిల్లలను కన్న తల్లిదండ్రులకైనా గుర్తొచ్చే పదం అమ్మ. 

వ్రాసినతను... IAS 





--
हम उन्को प्रणाम करते हे, जिनकी  त्यागशीलता का फल है  हमारे  भारत दॆश की  स्वतन्त्रता

Lets rededicate ourselves for bring back the glory that our nation had once upon a time. Our culture is encountering the biggest threat than ever. Lets pray god to give us the strength to spread good thoughts.
www.nic.gov.in
www.nss.iitm.ac.in
www.ivil.iitm.ac.in
www.isro.org  www.drdo.org    www.niot.res.in



--
మనిషి తినవలసినది శాకాహారమే. Human being should eat vegetarian food only. 
మెదడుకు పదునుపెట్టే ఆటవస్తువులు కొనాలంటే To buy science based games/ toys..www.arvindguptatoys.com
During travelling..play with rubic cube/ sudoku/ Chess; or discuss quantitative aptitude.

No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...