ఔషధ ధరలు 3,000 శాతం వరకూ పెంచి వసూలు
గరిష్ఠ చిల్లర ధరల్లో మాయ
విపణిలో విక్రయించే వాటిల్లో 80% పైగా ఇవే
ఆర్థికంగా భారీగా నష్టపోతున్న రోగులు
ఉద్యమించిన నిజామాబాద్ వాసి పీఆర్ సోమానీ
కేంద్ర ప్రభుత్వంలో కదలిక
క్యాన్సర్ మందుల ధరల తగ్గింపునకు ఆదేశాలు
ఈనాడు - హైదరాబాద్
అలర్జీతో బాధపడుతున్న ఓ వ్యక్తి సమీపంలోని ఔషధ దుకాణానికి వెళ్లాడు. వైద్యుడు రాసిచ్చిన మాంటెలూకాస్ట్ సోడియం అండ్ లెవో సిట్రజన్ డైహైడ్రో క్లోరైడ్' మాత్రలు అడిగాడు. వీటితో పాటు రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే 'రొసువాస్టాటిన్ 20 ఎంజీ' మాత్రలు కూడా కొనుగోలు చేశాడు. ఆ రెండింటికి కలిపి ఔషధ దుకాణదారు రూ.391.50కి బిల్లు వేసి, ఇందులో రూ.39.15 తగ్గించి.. రూ.352 వసూలు చేశాడు. ఈ రెండు ఔషధాలు ఒకే ప్రముఖ సంస్థ ఉత్పత్తి చేసినవి. ఇదే వ్యక్తి జన ఔషధి దుకాణానికి వెళ్లి.. ఇవే మందులను అవే ఉత్పత్తి సంస్థవి కొనుగోలు చేశాడు. ఇక్కడ ఆ రెంటికి కలిపి రూ.56 చెల్లించాడు. అంటే ఒకే సంస్థ ఉత్పత్తి చేసిన రెండు ఔషధాల ధరల్లో వ్యత్యాసం రెండు వేర్వేరు దుకాణాల్లో రూ.296. ఇంతగా వినియోగదారుడిని బాదేస్తున్నారు.
నిజామాబాద్‌కు చెందిన ఓ సామాన్యుడు ఔషధ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని నడుం బిగించాడు. 'నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ' వ్యవస్థాపక అధ్యక్షుడైన పీఆర్ సోమానీ గత మూడేళ్లుగా ఈ అడ్డగోలు ధరల పెంపుపై వేర్వేరు స్థాయుల్లో గళం విప్పాడు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి డీవీ సందానందగౌడ, తదితర మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులను కలిసి ఔషధ ధరల్లో జరుగుతున్న మాయాజాలాన్ని వారి దృష్టికి తీసుకొచ్చాడు.
చివరకు ప్రధాన మంత్రి మోదీ కార్యాలయం కూడా ఈ వ్యవహారంలో కలుగజేసుకోవడంతో.. తొలివిడత స్పందనగా 42 రకాల క్యాన్సర్ ఔషధాలపై ధరలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకొంది. కేంద్రం ఆదేశాలతో ఈ నెల 8 నుంచి క్యాన్సర్ ఔషధాల ధరలు తగ్గి ప్రజలకు ఊరట ఇవ్వనున్నాయి. ఈ విషయాలన్నింటినీ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోమానీ వివరించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి డి.సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎందుకు నియంత్రణ లేదు?
దేశంలో ఔషధ ధరల అడ్డగోలు దోపిడీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఔషధ ఉత్పత్తి సంస్థలు 'నాన్ షెడ్యూల్డ్' ఔషధాల ధరలను దాదాపు 3000 శాతం వరకూ అధికంగా ముద్రించి విపణిలో చిల్లర వర్తకులకు అందజేస్తున్నాయి. గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పీ)ల్లో జరుగుతున్న మాయను పసిగట్టలేని సామాన్యుడు.. దుకాణాదారు ఇచ్చే 10-20 శాతం తగ్గింపునే పరమానందంగా భావిస్తూ.. తనకు తెలియకుండానే భారీగా ఆర్థిక దోపిడీకి గురవుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఔషధాలను రెండు రకాలుగా విభజించింది. అధిక శాతం ప్రజలు ఎక్కువగా వినియోగించే ఔషధాలను 'షెడ్యూల్డ్ ఔషధాల' జాబితాలో చేర్చారు. ఇలాంటివి మొత్తం విపణిలో కేవలం 460(20 శాతమే) రకాల ఔషధాలే ఉన్నాయి. మూత్రపిండాల వైఫల్యం, క్యాన్సర్ వంటి వ్యాధుల్లో తప్పనిసరిగా ఉపయోగించేవి మొత్తం విపణిలో దాదాపు 27,321(80 శాతం) ఉన్నాయి. వీటిని 'నాన్ షెడ్యూల్డ్ ఔషధాల జాబితా'లో ఉంచారు. షెడ్యూల్డ్ ఔషధాల ధరలపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ పర్యవేక్షణ కొనసాగుతోంది. వీటిపై గరిష్ఠ చిల్లర ధర ఎంత ఉండాలనేది ఔషధ ధరల నియంత్రణ సంస్థ నిర్ణయిస్తోంది. నాన్ షెడ్యూల్డ్ మందుల ధరలను గాలికి వదిలేయడంతో దోపిడీ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఉత్పత్తి సంస్థ మొదలుకొని టోకు(హోల్‌సేల్/డీలర్), చిల్లర(ఔషధ దుకాణదారు) వర్తకులు, చివరకు వైద్యులు కూడా ఉండటం గమనార్హం.
దోపిడీ విధానమిలా.. * ఎవరైనా వస్తువు తయారు చేస్తే తనకొక 10 శాతం, టోకు డీలరుకు 10 శాతం, చిల్లర వర్తకుడికి 10 శాతం చొప్పున గరిష్ఠంగా 30 శాతం లాభాన్ని పొందాలనుకుంటారు. అంటే వస్తువు ఉత్పత్తి ధర రూ.100 అయితే.. వినియోగదారుడికి గరిష్ఠంగా రూ.130కు చేరాలి.* ఏటా 10 శాతం చొప్పున ఆ ధరను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎక్కువ ఉత్పత్తుల్లో ఇదే తరహాలో వ్యాపారం సాగుతోంది. ఔషధాలకొచ్చేసరికి ఈ విధానానికి చెల్లుచీటీ రాసేశారు. * గరిష్ఠంగా 30 శాతం వరకూ ఉండాల్సిన ధర.. వినియోగదారుడికి చేరేసరికి కొన్ని ఉత్పత్తుల్లో 3000 శాతానికి కూడా చేరుతోంది. * ఔషధ ఉత్పత్తి సంస్థలే ఈ దోపిడీ వ్యవహారాన్ని ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. * తమ ఉత్పత్తులనే అధికంగా వినియోగదారులు కొనుగోలు చేసే విధంగా చీటీలో ఆ మందులను రాసేలా ముందస్తుగానే వైద్యులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. * ఇదంతా పక్కా ప్రణాళికతో ఉత్పత్తి సంస్థ స్థాయి నుంచి వైద్యుడు, చిల్లర వర్తకుడి స్థాయి వరకూ కొనసాగుతోంది. * వినియోగదారుడు మాత్రం ఆ గరిష్ఠ చిల్లర ధరలో 20 శాతం తగ్గిస్తేనే ఆనందపడిపోతూ కొనుగోలు చేస్తున్నాడు. * ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీకి అడ్డూఅదుపే లేదు. కనీసం చిల్లర దుకాణాల్లోనైనా గరిష్ఠంగా 20 శాతమైనా తగ్గిస్తారు. * కార్పొరేట్ ఆసుపత్రుల్లో అయితే ఎంత ఖరీదు వేస్తే అంత చెల్లించాల్సిందే. |
ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యం: సోమానీ ప్రజలు ఆహారం కొనుగోలు చేయడానికయ్యే ఖర్చు కంటే ఔషధాల కొనుగోలుకు అయ్యేదే ఎక్కువగా ఉంటోంది. మందులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. కొద్దిపాటి ఆస్తులను కూడా అమ్ముకుని అప్పుల పాలవుతున్నారు. నా పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. త్వరలోనే జాతీయ ఔషధ నియంత్రణ చట్టంలో మార్పులు చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా హామీ ఇచ్చారు. ముందుగా క్యాన్సర్ చికిత్స ఔషధాల ధరలను తగ్గించడం శుభపరిణామం. నాన్ షెడ్యూల్డ్ ఔషధాల ధరలపైనా నియంత్రణ విధిస్తే ప్రజలకు మేలు చేకూరుతుంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య బీమాల్లోనూ చికిత్సల ధరలు తగ్గుతాయి. వైద్య పర్యాటకం కూడా పెరుగుతుంది. |
No comments:
Post a Comment