Sunday, April 21, 2019

Re: ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం from eenadu

Vikram

Excellent initiative. Shall we participate in this movement? Could we place our Telugu science books in public places as described in these articles?
Can u pl pass on the site link where these articles are put up?

thank you
vsc


On Sun, Apr 21, 2019 at 9:07 AM विक्रम भय्या vikramkumar <vikrambhayya@gmail.com> wrote:

 కథలంటే మనిషికి ఎంతో ఇష్టం... అవి మనిషి రాసిన కట్టుకథలైనా... మనిషి జీవితాన్ని రాసిన నిజం కథలైనా! అందుకే ఆ కథల్ని చెప్పే పుస్తకాలంటే మరీ మరీ ఇష్టం.  (ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం)

పుస్తకం ఆనందాన్నిస్తుంది. అలవాట్లను మారుస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. తరాల మధ్య వారధీ, జ్ఞానాన్ని పంచే నిధీ అయిన పుస్తకం మనిషి జీవితంలో విడదీయరాని భాగం. మంచితనాన్నీ మానవత్వాన్నీమనసులో నింపే నిజమైన నేస్తం లాంటి పుస్తకాల్ని చదవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమత కొందరికే అనుకూలిస్తుంది. మిగిలినవారు ఆ అదృష్టానికి నోచుకోలేదని బాధపడకుండా పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో-  వ్యక్తులుగానూ సంస్థలుగానూ పలువురు అందిస్తున్న పుస్తక సేవలివి!
 

బుక్‌ ఫెయిరీ... ఉద్యమం!

కొనుక్కుని ఒకసారో రెండుసార్లో చదివాక ఆ పుస్తకం బీరువాలో వృథాగా పడి ఉంటుంది. అలా కాకుండా పుస్తకాన్ని ఎప్పుడూ ఎవరో ఒకరు చదువుతూ ఉండేలా చేయాలన్న ఆలోచన వచ్చింది బ్రిటన్‌కి చెందిన కార్డెలియా ఆక్స్‌లీకి. పుస్తకాల షాపు యజమానిగా కొత్త పుస్తకాన్ని చూడగానే చాలామంది కళ్లల్లో కనిపించే మెరుపుని ఆమె గమనించేది. ఓసారి హ్యారీపాటర్‌ కొత్త పుస్తకం విడుదలైనప్పుడు అర్ధరాత్రి నుంచే బారులు తీరిన కొనుగోలుదారుల్లో పుస్తకం అందుకోగానే కన్పించిన ఆనందం ఆమెను ఆలోచింపజేసింది. పుస్తకాలు కొనుక్కోలేనివాళ్లకూ ఆ ఆనందం అందాలంటే... ఏదో ఒకటి చేయాలి- అనుకున్న ఆమె 'బుక్‌ఫెయిరీ' ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. లైబ్రరీకి వెళ్లక్కరలేకుండా, ఎలాంటి డిపాజిట్లూ, ఫైన్లూ కట్టనక్కరలేకుండా ఊహించని రీతిలో ఓ మంచి పుస్తకం చేతికి అందితే పుస్తకాల పురుగులకు ఎంత ఆనందం?
అది తీసుకుని చదివి మళ్లీ మరొకరికి అందేలా ఎక్కడో చోట పెట్టేయడమే... ఆ ఉద్యమం. లండన్‌లోని సబ్‌వేలో మొదలైన ఏడాదికే అన్ని దేశాలకూ విస్తరించింది ఈ ఉద్యమం.

మనమూ పంచుకోవచ్చు!

రైల్లో, బస్సుల్లో, పార్కుల్లో... ఇలా ఈ మధ్య ముంబయి, దిల్లీ, బెంగళూరులో ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు దొరుకుతున్నాయి. దానికి కారణం బుక్‌ఫెయిరీ ఉద్యమం మనదేశంలోనూ ఊపందుకోవటమే. కాదంబరి మెహతా తాను చదివిన కొన్ని వందల పుస్తకాలను ముంబయిలోని వేర్వేరు ప్రదేశాల్లో చదువరులకోసం వదిలిపెట్టారు. అవి తీసుకున్నవారూ చదివి మళ్లీ ఎక్కడోచోట పెడుతున్నారు. శ్రుతి, తరుణ్‌ అనే జంట 'బుక్స్‌ ఆన్‌ ద దిల్లీ మెట్రో' పేరుతో దిల్లీలో తాము ప్రయాణించే మెట్రోరైల్లో పుస్తకాలు పెట్టడం మొదలుపెట్టారు. ఎలాంటి పుస్తకాన్ని, ఏ రైల్లో పెట్టారో చెబుతూ వారు సోషల్‌ మీడియాలో క్లూలు ఇవ్వటంతో అది చాలామందిని ఆకట్టుకుంటోంది.
పుస్తకాలు దొరికినవారు ఉత్సాహంగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. చదివాక తామూ మరోచోట దాన్ని వదిలిపెట్టి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. పుస్తకాలు ఉండి వాటిని ఇతరులతో పంచుకోవాలనుకునేవారు ఎవరైనాసరే ఇలా చేయవచ్చు. 'ఈ పుస్తకం తీసుకోండి. మీరు చదివి మరొకరి కోసం మళ్లీ ఎక్కడైనా పెట్టండి...' అని రాసివుండే స్టికర్‌ ఒకటి పుస్తకం మీద అతికించి దాన్ని రద్దీగా ఉండే చోట వదిలిపెట్టాలి. దాని గురించి సోషల్‌ మీడియాలో క్లూ ఇస్తే పదిమందికీ తెలుస్తుంది. మన ఊళ్లోనూ పుస్తకాల సందడి షురూ అవుతుంది!

వీధి లైబ్రరీలు!

'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...' అని పాడుకుంటూ కోల్‌కతా వాసులు హాయిగా నగర వీధుల్లోనే లైబ్రరీలు పెట్టేసుకున్నారు. రకరకాల పుస్తకాలు... కొత్తవీ పాతవీ కథలూ నవలలూ కవితలూ జీవిత చరితలూ ఏవి కావాలంటే అవి- తెరిచి ఉన్న బీరువాల్లోంచి పుస్తక ప్రియులకు స్వాగతం చెబుతాయి. ఆఫీసు నుంచి తిరిగి వస్తున్నప్పుడు నచ్చిన పుస్తకం తెచ్చుకోవచ్చు. చదివాక మళ్లీ తీసుకెళ్లి అక్కడ పెట్టేసి మరో పుస్తకం తీసుకోవచ్చు. మనం ఏ పుస్తకం
తీసుకున్నామో ఎవరూ చూడరు, ఇన్నాళ్లు ఉంచుకున్నారేంటీ అనీ అడగరు. పైగా అక్కడ పుస్తకాలు వెతుక్కునే క్రమంలో అదే వీధిలో ఉన్న మరికొందరు పుస్తకాభిమానులూ పరిచయం కావచ్చు. వారితో మాటామంతీ కలిపి అభిప్రాయాలు పంచుకోవచ్చు. చదువరులకూ పుస్తకాల దుకాణాలకూ పేరొందిన తమ నగరాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ గత ఏడాదే ఈ వీధి లైబ్రరీలను ప్రారంభించి, అన్ని పుస్తకాలూ అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తోంది. ఖాళీ అయిన పుస్తకాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. ఎవరూ కాపలా లేని ఈ లైబ్రరీల్లో పుస్తకాలను ఎవరూ కొట్టేయరు. చదివి చక్కగా తెచ్చి మళ్లీ అక్కడ పెట్టేస్తున్నారు.

తోపుడు బండి... సంతలో పుస్తకాలు!

చిన్నప్పటినుంచి పుస్తకాలు చదువుతూ పెరిగిన సాదిక్‌ అలీ పేద పిల్లలకూ కథల పుస్తకాలు చదివే అవకాశం ఇవ్వాలనుకున్నాడు. అందుకు ఈ వరంగల్‌ వాసి ఎంచుకున్న మార్గం తోపుడు బండి. ఓ తోపుడుబండి నిండా పిల్లలు ఇష్టపడే రకరకాల కథల పుస్తకాలు నింపుకుని దాన్ని తోసుకుంటూ ముందు నగరంలోని మురికివాడల్లో, చుట్టుపక్కల పల్లెల్లో తిరుగుతూ రూ.5, 10లకే పుస్తకాలను అమ్మేవాడు. కొంతమంది పిల్లలు అలా కొనుక్కోవడానికీ ఇబ్బంది పడటమూ పుస్తకంలో కథల్ని తమ నోటు పుస్తకంలో రాసుకుని తిరిగిచ్చేయడమూ చూసిన ఆయన ఆ తర్వాత దాతల సహకారంతో పుస్తకాలు కొనుక్కెళ్లి ఉచితంగానే పంచిపెట్టేవాడు. అలా వందలాది గ్రామాల్లో పిల్లలకు పుస్తకాలు పంచిన సాదిక్‌ పలు పాఠశాలల లైబ్రరీలకు కూడా ఉచితంగా పుస్తకాలను అందజేశాడు.
ఒడిశాలోనూ ఓ జంట ఇలాగే పల్లెల్లో పిల్లలకు అసలు కథల పుస్తకాలు ఎలా ఉంటాయో తెలియదని గుర్తించి వారికి ఆ ఆనందాన్ని పంచే బాధ్యతను తమ భుజాలకెత్తుకున్నారు. చేస్తున్న ఉద్యోగాలు మానేసి మరీ శతాబ్దీ మిశ్రా, అక్షయ్‌లు బ్యాగుల్లో పుస్తకాలు మోసుకెళ్లి గ్రామాల్లో సంత రోజున రోడ్డు పక్కన పెట్టి సగం ధరకే వాటిని అమ్మేవారు. అది కూడా పెట్టలేని వారిని చదివి తిరిగిమ్మనేవారు. తర్వాత ఒక పాత వ్యాను కొని దాంట్లో పుస్తకాలు తీసుకుని రాష్ట్రమంతా తిరిగారు. కొందరు ప్రచురణకర్తల సహకారంతో ఓ పెద్ద ట్రక్కులో పుస్తకాలు పెట్టుకుని తిరుగుతూ ఇరవై రాష్ట్రాల్లోని గ్రామాలకు వెళ్లి పిల్లలకు కథల పుస్తకాలను ప్రత్యక్షంగా చూసి, చదివే అవకాశం కల్పించారు.

రైలూ... బస్టాండూ!


పుస్తకాలు చదివే అలవాటున్న వాళ్లు ప్రయాణం చేయాల్సి వస్తే తప్పకుండా బ్యాగులో ఓ పుస్తకమూ పట్టుకెళ్తుంటారు. పొరపాటున అలా పెట్టుకోవటం మర్చిపోతే అంత సమయం వృథాగా గడపాల్సివచ్చినందుకు బాధపడతారు.
మహారాష్ట్రలోని 'ద డెక్కన్‌ క్వీన్‌', 'పంచవటి' అనే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించేవారు అలా బాధపడాల్సిన పని లేదు. పుస్తక పఠనం పట్ల ప్రజల ఆసక్తి గమనించిన మహారాష్ట్ర విద్యాశాఖ, రైల్వే శాఖతో కలిసి ముంబయి- పుణె, ముంబయి- మన్మాడ్‌ మధ్య ప్రయాణించే ఈ రెండు రైళ్లలో ప్రత్యేక లైబ్రరీలను ఏర్పాటుచేసింది. ఈ రైళ్లలో చాలామంది సీజన్‌ టికెట్టు కొనుక్కుని రోజూ ముంబయి వెళ్లివస్తుంటారు. ఇప్పుడు వారంతా ప్రత్యేక రుసుములేమీ కట్టనక్కరలేకుండా తమ టికెట్టు ఆధారంగానే రైల్లో పుస్తకాలు తీసుకోవచ్చు. చక్రాలబండిలో పుస్తకాలు పెట్టుకుని ప్రయాణికుల సీట్ల దగ్గరికే వస్తారు లైబ్రరీ సిబ్బంది. మన దేశంలో మొదలైన తొలి రైలు లైబ్రరీలు ఇవే. కథల పుస్తకాల్లాగే రైళ్లూ పిల్లలకు ఆసక్తి కలిగిస్తాయని భావించిన కోయింబత్తూరులోని 'ఎల్లో ట్రెయిన్‌' అనే పాఠశాల కూడా ఓ పాత రైలు బోగీని కొనుక్కొచ్చి మరీ అందులో పుస్తకాల లైబ్రరీని ఏర్పాటుచేసింది. పిల్లలకు రైల్లో కూర్చుని చదువుతున్న అనుభూతిని కలిగిస్తోంది.
రైలు సరే, బస్టాపులో కూర్చుని ఏం చేస్తాం? అప్పుడూ పుస్తకం చదువుకోవచ్చుగా అనుకున్నాడు గౌహతికి చెందిన అశోక్‌ ఖన్నా. అనుకున్నదే తడవు అధికారుల అనుమతి తీసుకుని నగరంలోని ఓ బస్టాండ్‌లో బెంచీల
వెనకాల అరలన్నీ పుస్తకాలతో నింపేశాడు. వాటిని ఎవరైనా తీసుకుని చదువుకోవచ్చు. ఏదైనా పుస్తకం నచ్చి పట్టుకెళ్లాలనుకుంటే మళ్లీ మరో పుస్తకం తెచ్చి అక్కడ పెట్టాలన్నది ఒక్కటే నియమం. ఇప్పుడు ఆ బస్టాపులో ఎవరూ బస్సు రాలేదని విసుగ్గా ఎదురుచూస్తూ ఉండరు, హాయిగా ఓ పుస్తకం తీసుకుని చదువుకుంటూ ఉంటారు.

పుస్తకాల ఊరు!

ఆ ఊళ్లోకి అడుగుపెడుతూనే పుస్తకాల వాసన వస్తుంటుంది. ఏ వీధికి వెళ్లినా ఏదో ఒక ఇంట్లో పుస్తకాల అరలు తెరిచి ఉంటాయి. రారమ్మని ఆహ్వానిస్తాయి. కోటగోడలను తలపించే భవనంలో చరిత్ర పుస్తకాలు, రంగురంగుల బొమ్మలున్న భవనంలో పిల్లల పుస్తకాలు... ఇలా ఒకో వీధిలో ఒకో రకం పుస్తకాలు చదువరులను ఊరిస్తుంటాయి. మహారాష్ట్రలోని భిలార్‌ రెండేళ్ల క్రితం వరకూ ఒక మామూలు ఊరు. దాన్ని పుస్తకాల ఊరుగా మార్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. ఊరివారికీ నచ్చింది. తమ ఇంట్లో కొంత భాగాన్ని గ్రంథాలయంగా మార్చేందుకు వీధికో కుటుంబం ముందుకొచ్చింది. అలా ఒక్కో ఇంట్లో నాలుగొందలకు పైగా పుస్తకాలతో పాతిక ఇళ్లూ, మొత్తం 15 వేల పుస్తకాలతో దేశంలోనే మొదటి పుస్తకాల ఊరూ తయారయ్యాయి. ఎవరైనా అక్కడికి వెళ్లవచ్చు. నచ్చిన పుస్తకం తీసుకుని ముంగిళ్లలో చల్లగాలిని ఆస్వాదిస్తూ టీనో, కాఫీనో తాగుతూ ఓపికున్నంతసేపు చదువుకోవచ్చు. తర్వాత ఆ పుస్తకాన్ని తీసిన చోటే పెట్టేసి వెళ్లిపోవచ్చు. పుస్తకం కోసం రూపాయి ఇవ్వనక్కరలేదు. ఇంకేముంది... పుస్తకప్రియులకు అది పిక్నిక్‌ విలేజ్‌ అయిపోయింది.

పఠనాసక్తికి పునాది!


పిల్లలకు చిన్నవయసులోనే చదవడం అలవాటు చేయాలి, అందుకు పాఠశాలల ద్వారానే ప్రయత్నించాలనుకున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు. అందుకుగాను ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలనుకున్నారు ఆయా సంస్థల నిర్వాహకులు. 'బేసిక్‌ రీసెర్చ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ' (బ్రెడ్‌ చిల్డ్రన్స్‌ సొసైటీ) అనే సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ కలిపి గత డిసెంబరు వరకూ 1,146 పిల్లల గ్రంథాలయాలను ఏర్పాటుచేసింది. 

లైబ్రరీలో పుస్తకాలను చదివి పిల్లలు రాసే మంచి సమీక్షలకు ఏటా బహుమతులనూ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. పల్లెటూరి యువతలోనూ, పిల్లల్లోనూ పఠనాసక్తిని పెంపొందించడానికి 'రూరల్‌ లైబ్రరీ ఫౌండేషన్‌' అనే మరో సంస్థ 80 లైబ్రరీలు నెలకొల్పింది. అవి కాక కొందరు ప్రవాస భారతీయులూ, మరికొందరు స్థానిక దాతల సహకారంతో తెలంగాణ జిల్లాల్లో 39 గ్రంథాలయాలను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ జంట ప్రారంభించిన 'ఫుడ్‌ ఫర్‌ థాట్‌ ఫౌండేషన్‌' దేశవ్యాప్తంగా 185 లైబ్రరీలను నెలకొల్పింది. ఈ సంస్థ పాఠశాలల్లోనే కాక ఆస్పత్రుల ఆవరణలో, కారాగారాల్లో కూడా లైబ్రరీలు పెట్టింది. కొన్ని వేల పుస్తకాలను ఉచితంగా పంచింది. ఖాళీగా ఇళ్లలో ఉన్న పుస్తకాలనూ, కొనుక్కునే స్తోమత లేనివారినీ కలుపుతూ పుస్తకాలకు కొత్త జీవితాన్ని ఇస్తున్న వీరి కార్యక్రమం మంచి ఆదరణ పొందింది. పుస్తకాలకు బార్‌కోడ్‌ ఏర్పాటుచేయడంతో తాము ఇచ్చిన పుస్తకం ఎక్కడ ఉందో డొనేట్‌ చేసిన వాళ్లు ఆప్‌ ద్వారా తెలుసుకునే ఏర్పాటుచేసింది ఈ ఫౌండేషన్‌.

ఒక స్కూలు వంద లైబ్రరీలు!


'మిషన్‌ 100'... ఇది ఒడిశాలోని సాయి ఇంటర్నేషనల్‌ స్కూలు పిల్లలు చేపట్టిన ప్రాజెక్టు. స్కూలు లైబ్రరీ సాయంతో పాఠ్యపుస్తకాలతో పాటు కథల పుస్తకాలనూ చదువుతూ పెరిగిన పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అసలు లైబ్రరీ అనేదే లేదన్న వార్త ఆలోచింపజేసింది.

పదో తరగతి చదువుతున్న ఆ పిల్లలు తమ వంతుగా ఏమన్నా చేయాలనుకున్నారు. టీచర్లతోనూ ప్రధానోపాధ్యాయుడితోనూ చర్చించి వంద పాఠశాలలకు లైబ్రరీలను ఏర్పాటుచేసే 'మిషన్‌ 100' అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల స్థాయికి తగిన 500 పుస్తకాలతో ఓ బీరువా చొప్పున ఏటా నాలుగైదు పాఠశాలలకు ఇస్తూ గత ఏడేళ్లలో పాతిక పాఠశాలలకు లైబ్రరీలను ఏర్పాటుచేశారు. ఈ లైబ్రరీలోని పుస్తకాల్లో సగం మాతృభాషలో,  మిగిలిన సగం హిందీ, ఇంగ్లీషుల్లో ఉంటాయి. ఒక్కో లైబ్రరీకీ ఎంత లేదన్నా రూ.30 వేలు ఖర్చవుతుంది. ఆ డబ్బుని కూడా స్కూల్లోనే వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలే సమకూర్చుకుంటున్నారు. స్కూలు చదువు ముగించుకుని పై చదువులకు వెళ్లిన పిల్లలు కూడా లైబ్రరీ ప్రాజెక్టు విషయంలో ఏటా తమ వంతు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రావటం విశేషం. తాము ఏర్పాటుచేసిన లైబ్రరీలను పిల్లలు ఏమాత్రం వినియోగించుకుంటున్నారో కూడా తరచూ వెళ్లి చూసి, సలహాలు ఇచ్చి వస్తుంటారు ఈ పిల్లలు.

మంచి పుస్తకాన్ని కానుకగా ఇస్తే... చిన్నారి పాపాయి రంగుల కలలకు రెక్కలు తొడగొచ్చు. ఎదుగుతున్న కుర్రాడికి సమాజ పోకడలను విప్పి చెప్పొచ్చు. ఆవేదనలో ఉన్న ఆత్మీయనేస్తానికి ఓదార్పునివ్వొచ్చు. పండువయసులోని పెద్దలకు ధైర్యాన్ని ఇవ్వొచ్చు. మన ప్రియతముల కోసం మొత్తం ప్రపంచాన్నే చాపలా చుట్టి చేతిలో పెట్టొచ్చు ఆ కానుక... ఇస్తున్నారా మరి..?

Attached is the photo taken at IIT alumni meeting ... poster on the wall


--
V. Srinivasa Chakravarthy, PhD
Department of Biotechnology,
Indian Institute of Technology Madras
Chennai 600036
India.
Tel: (044) 2257 4115
URL: https://biotech.iitm.ac.in/Faculty/CNS_LAB/home.html
Blog: www.scienceintelugu.blogspot.com

No comments:

Post a Comment

Security status not satisfied.

I was planning to say hello, but now I think greetings are unnecessary. Firstly, I already know you and all your loved ones very well. ...