ఓ పక్క... చినుకు పడితే గానీ పంట పండని నేలలు. మరోపక్క...ఊరికి ఆవల ఉప్పొంగి ప్రవహిస్తున్న జలధార. ఆ నీటిని పొలాలకు మళ్లించే నాయకుడు వస్తాడేమో అని ఏళ్ల తరబడి ఎదురు చూశారు అక్కడి జనం. చివరికి విసిగిపోయి ఆశల మీద నీళ్లు చల్లి ఊరుకున్నారు. కానీ వారిలో ఒక్కడు మాత్రం ఊరుకోలేకపోయాడు. తనే నాయకుడు అయ్యాడు. ఒంటిచేత్తో కాలువ తవ్వడం మొదలు పెట్టాడు. ఫలితం... వందెకరాల బీడు భూముల్లో పచ్చని పైరులు మొలిచాయి.
వైతరణి... ఒడిశాలోని కెందుఝార్ జిల్లా, బన్స్‌పల్ గిరిజన ప్రాంతంలోని ఓ ఊరు. చుట్టూ కొండలూ అడవి మధ్య ఉండే ఈ ఊళ్లో నేల తడవాలన్నా పంట పండాలన్నా వాన నీరే దిక్కు. మరోపక్కేమో ఊరంతా వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్లే. పంట బాగా పండితే గానీ తిండి గింజలు దొరకని పరిస్థితి. వర్షాలు అసలు పడకపోయినా సమయానికి సరిగా కురవకపోయినా వారి పంట చేతికొచ్చేది కాదు. ఏడాదంతా ఆ ప్రాంతం కరవుతో అల్లాడిపోయేది. నిజానికి వైతరణి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే గోణశిఖ పర్వతం నుంచి నీటి ప్రవాహం వెళ్తుంది. ఆ జలాలను ఊరికి మళ్లిస్తే ఏడాదికి మూడు పంటలు సాగు చేసుకునే వీలుంటుంది. అదే విషయాన్ని స్థానిక అధికారులకు చెప్పి కాలువ నిర్మించమని వేడుకున్నారు గ్రామస్థులు. కానీ ఏళ్లు గడిచినా వారి గోడు పట్టించుకునే నాయకుడే రాలేదు.
ఒక్క అడుగే...
ఓసారి రెండు మూడు సంవత్సరాలు వరుసగా వర్షాలు సరిగా పడలేదు. దాంతో కరవు మరింతగా తాండవం చేసింది. అందరిలానే స్థానికంగా ఉండే దైతారీ నాయక్ మీద కూడా ఆ ప్రభావం బాగా పడింది. కానీ అందరిలా అతడు అది తమ తలరాత అనుకుని ఊరుకోలేకపోయాడు. కుటుంబానికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని నిస్సహాయతను జీర్ణించుకోలేకపోయాడు. గంగను భువికి తెచ్చిన భగీరథుడిలా ఆ కొండమీదున్న గంగమ్మను తనే ఊరికి తేవడానికి పూనుకున్నాడు. పలుగూ పారా పట్టుకుని, ఒంటిచేత్తో కొండదగ్గర్నుంచి కాలువ తవ్వడం మొదలుపెట్టాడు. అలా అని దైతారీ నాయక్ వయసేమీ తక్కువ కాదు. అప్పటికే 70ఏళ్లకు చేరువలో ఉన్నాడు. కానీ అతడి గుండెబలమే ఆ గుట్టల దారిని పిండి చేయడం మొదలుపెట్టింది. రోజూ ఉదయమే వెళ్లి కొన్ని గంటల పాటు కాలువ పని చేసేవాడు. కొన్నాళ్లకు అతడి ప్రయత్నాన్ని చూసి నాయక్ నలుగురు సోదరుల మనసూ కదిలింది. వాళ్లూ చేయి కలిపారు. మూడేళ్లకు రాళ్లూ మట్టితో వాళ్లు వేసిన కాలువ అడవి గుండా ఊరి చివర వరకూ వచ్చింది. నాయక్, అతడి అన్నదమ్ముల కృషిని కళ్లారా చూశాక గానీ ఊరి వాళ్లు కళ్లు తెరవలేదు. నిజానికి నాయక్ 'మనమే కాలువ తవ్వుకుందాం... కాస్త కష్టపడితే అందరి పొలాలూ పండుతాయి' అని ఊరి వాళ్లకు ముందే చెప్పాడు. కానీ 'మూడు కిలోమీటర్ల దూరం కాలువ తవ్వడం మాటలేనా...' అంటూ అందరూ వెనకడుగు వేశారు.
చివరికి 'అందరికీ నీరు తెచ్చే ఆ ప్రయత్నానికి ఇకమీదటైనా సాయపడతామ'ని ముందుకొచ్చారు. అలా ఒక్కడి ప్రయత్నంతో మూడు కిలోమీటర్ల పొడవునా కాలువ ఏర్పడింది. వైతరణి గ్రామం చుట్టుపక్కలున్న వంద ఎకరాలూ సస్యశ్యామలం అయ్యాయి. దాదాపు అయిదేళ్లుగా ఏరోజూ ఆ జలధార ఆగలేదు. ఇప్పుడు అక్కడి పొలాల్లో వరి, మొక్కజొన్న, ఆవాలతో పాటు కూరగాయల్నీ పండిస్తున్నారు రైతులు. దైతారీ నాయక్ చేసిన గొప్ప పని గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ ఠాక్రె గ్రామానికి వచ్చి అతడిని అభినందించడంతోపాటు ఆ కాలువకు కాంక్రీటుతో మరమ్మతులు చేయించి పటిష్ఠంగా మారుస్తామనీ అక్కడ చెక్ డ్యామ్‌ని కూడా నిర్మిస్తామనీ హామీ ఇచ్చారు. ఇక, వయసుని లెక్కచేయకుండా ఒంటిచేత్తో వందెకరాలకు నీరిచ్చిన దైతారీ నాయక్‌ని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడంలో శ్చర్యమేముందీ... నాయక్ నిజంగా నాయకుడే కదూ..!
No comments:
Post a Comment