జులై 15న చంద్రయాన్-2
చురుగ్గా ఏర్పాట్లు పూర్తిచేస్తున్న ఇస్రో
అభివృద్ధి పథంలో మరో ముందడుగు
ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న చంద్రయాన్-2కు ముహూర్తం కుదిరింది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఇస్రో శాస్త్రవేత్తలు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల కిలోమీటర్ల దూరంలోని చందమామపైకి వెళ్లి పరిశోధనలు నిర్వహించడంలో ఈ ప్రయోగం ఎంతో కీలకం. అంతరిక్ష ప్రయోగ రంగంలో భారత్‌కు ఉన్న కీర్తి ప్రతిష్ఠల్ని, స్వదేశీ పరిజ్ఞానంపై మన నమ్మకాన్ని మరింత ఇనుమడింపజేసే రీతిలో మరో నెల రోజుల్లో శ్రీహరికోట వేదికగా ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ప్రస్థానాన్ని ప్రారంభించిన రెండు నెలల్లోనే చందమామ వద్ద నుంచి కీలక సమాచారం మనకు అందబోతోంది.
ఈనాడు డిజిటల్- బెంగళూరు, శ్రీహరికోట -న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకొనే రీతిలో చందమామ రూపురేఖా విలాసాలు తెలుసుకునే చంద్రయాన్-2 యాత్ర జులై 15న తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రారంభం కానుంది. 2008 అక్టోబరులో ప్రయోగించిన చంద్రయాన్-1 పూర్తిస్థాయి లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దీంతో ఇస్రో ఈ చంద్రయాన్-2ను సవాలుగా స్వీకరించి ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే జులై 9 - 16వ తేదీల మధ్యలో చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టాలని భావించినా శాస్త్రవేత్తలు వివిధ అంశాలను పరిగణనలో తీసుకుని ఆ నెల 15వ తేదీని ఖరారు చేశారు. శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్‌వీ- మార్క్ 3 వాహక నౌక ద్వారా పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రం, సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో చురుగ్గా జరుగుతున్నాయి. చంద్రుడిపై ఇంతవరకు ఏ వాహక నౌక చేరుకోని ప్రాంతంలో సెప్టెంబరు 6వ తేదీన రోవర్ దిగనుంది. చంద్రుని ఉపరితలంపై పరిశోధనలకు ఇది వీలు కల్పిస్తుంది.
ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్తల సహకారం
ఈనెల 14న ఆర్బిటర్, 17న ల్యాండర్లను శ్రీహరికోట ఇస్రో కేంద్రానికి తరలించనున్నారు. చంద్రయాన్-2కు సంబంధించిన ఆర్బిటర్‌లో అశోక చక్రాన్ని, ఇస్రో చిహ్నాన్ని ప్రదర్శిస్తారు. చంద్రయాన్-2లో పాలుపంచుకున్న వారిలో 30 శాతం మహిళా శాస్త్రవేత్తలు ఉండటం విశేషం.
మహా సాంకేతికత... చంద్రయాన్-2 కోసం విదేశీ సేవలు, నేవిగేషన్ వ్యవస్థలకు రూ.603 కోట్లు వ్యయం కాగా లాంచింగ్ వ్యవస్థకు మరో రూ.375 కోట్లు ఖర్చు కానుంది.* 60 శాతం పనులకు మన దేశంలోని 120 పరిశ్రమలు, 500 విశ్వవిద్యాలయాలు సహకరించాయి. * జీఎస్ఎల్‌వీ ఎంకే-3 బరువు 640 టన్నులు. * 27 కిలోల ప్రగ్యాన్ రోవర్, 2.3 టన్నుల ఆర్బిటర్, 1.4 టన్నుల విక్రమ్ ల్యాండర్‌లతో జీఎస్ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌ను ప్రయోగిస్తారు. * చంద్రయాన్-2 సెప్టెంబరు ఆరు లేదా ఏడో తేదీన చంద్రుని నుంచి సంకేతాలు పంపగలదని ఇస్రో అంచనా. |
5 దశల్లో చంద్రుడి మీదకు 1 జీఎస్ఎల్‌వీ మార్క్-3 ఉపగ్రహ వాహక నౌక జులై 15న శ్రీహరికోట నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి 5 రోజుల తర్వాత భూ నియంత్రిత కక్ష్యలోనికి ప్రవేశిస్తుంది.2 అక్కడి నుంచి 3.5 లక్షల కిలోమీటర్ల దూరం చంద్రుని వైపు ప్రయాణిస్తుంది. 3 అనంతరం రాకెట్ నుంచి విడివడి ఆర్బిటర్, రోవర్, ల్యాండర్లు చంద్రుని దక్షిణ ధ్రువం వైపు మళ్లుతాయి. 4 చంద్రునికి 30 కి.మీ. దూరంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోతుంది, ఇదే క్లిష్టమైన దశ. 5 చివరిగా ల్యాండర్ ద్వారాల నుంచి బయటకు వెళ్లే రోవర్ చంద్రుడిపై చేరి 4 గంటల తర్వాత ప్రయోగాలు మొదలు పెడుతుంది. |
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో.. చంద్రయాన్-2ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.* ల్యాండర్‌కు విక్రమ్, రోవర్‌కు ప్రజ్ఞాన్ అనే పేర్లు పెట్టారు. పరీక్షల కోసం చంద్ర మండలం మీద తిరిగేది ఈ రోవరే. * ఇస్రో 2008 అక్టోబర్ 22న చంద్రయాన్-1 ప్రయోగం చేపట్టింది. కానీ అది పూర్తిస్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో చంద్రయాన్-2 ప్రయోగం చేయాలని తలచింది. పదేళ్ల అనంతరం ఇప్పుడు ఆ కల నెరవేరనుంది. * చంద్రయాన్-1 ప్రయోగానికి రూ.380 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్-2కు 2008లో రూ.425 కోట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే దీని రూపకల్పన, ప్రయోగానికి దాదాపు పదేళ్ల సమయం పట్టడంతో ఖర్చు రూ.978 కోట్లకు పెరిగింది. * చంద్రయాన్-2కు సంబంధించి ఉపగ్రహాలను త్వరలోనే బెంగళూరు నుంచి షార్‌కు తీసుకురానున్నారు. * షార్‌లోని రెండో ప్రయోగ వేదిక సమీపంలోని ఎస్ఎస్ఏబీలో అనుసంధాన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనికోసం షార్ ఉద్యోగులు రేయింబవళ్లు పని చేస్తున్నారు. ఇప్పటికే రెండు దశల పనులు పూర్తయినట్లు తెలిసింది. ఈ మేరకు పరీక్షలు నిర్వహించారు. ఇక క్రయో దశ, ఉపగ్రహాలను రాకెట్‌తో అనుసంధానం చేయాల్సి ఉందని తెలిసింది. |
* పేలోడ్స్: 11 (వీటిలో భారత్‌కు చెందినవి ఆరు, ఐరోపాకు చెందినవి మూడు, అమెరికాకు చెందినవి రెండు.) |
15 నిమిషాలూ కీలకం
- కె.శివన్, ఇస్రో ఛైర్మన్ |
No comments:
Post a Comment