వందరూపాయల నోటును మన చేత్తో చెత్తబుట్టలో పడేయగలమా... పొరపాటున కూడా పడేయం. పోనీ పది రూపాయలు... ఊహూఁ. మరి అదే డబ్బుతో కొన్న ఆహారాన్ని మాత్రం రెండో ఆలోచన లేకుండా పడేస్తున్నామే! మిగిలిపోయిందనో, పాడైపోయిందనో... మనదేశంలోనే ఏకంగా రోజుకు దగ్గర దగ్గర రూ.250 కోట్ల ఖరీదు చేసే ఆహారాన్ని వృథా చేస్తున్నామని నిపుణులు లెక్కలు తేల్చారు.
విలువను గుర్తించి గౌరవించాలని పెద్దలు 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అన్నారు. ఇప్పుడే కాదు, సృష్ట్యాది నుంచీ కూడా మనిషి చరిత్రలోని ప్రతి అడుగులోనూ ఆహారానిది ముఖ్యమైన పాత్రే. వేట జీవనాధారంగా బతికిన దశలోనూ మనుషులు తాము సంపాదించిన ఆహారం మర్నాటికి వృథా అయిపోతుందని పక్కవారితో పంచుకోవడం అలవాటుచేసుకున్నారు. ఒంటరిగా గుహల్లో బతికిన మనిషి సంఘజీవిగా మారడానికి దారితీసింది ఈ ఆహారం పంచుకునే ప్రక్రియేనట. అప్పటినుంచి ఇప్పటివరకూ నలుగురూ కలిసి ఉండటానికీ స్నేహాలూ పరిచయాలూ పెంచుకోడానికీ ప్రేమను వ్యక్తంచేయడానికీ కలిసి విందు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఎవరైనా ఒక మంచి కబురు చెబితే నోరు తీపి చేస్తాం. ఆఖరికి పూజించే దేవుళ్లకూ నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారపదార్థాలనే పెడతాం. ఇంట్లో శుభకార్యమైతే పదిమందికీ కడుపునిండా భోజనం పెట్టి సంతోషాన్ని పంచుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితం ఆహారం చుట్టూనే తిరుగుతుంది. అందుకే జీవికి ప్రాణభిక్ష పెట్టే ఇంత ముఖ్యమైన ఆహారాన్ని అంత పెద్ద మొత్తంలో వృథా చేయడం చరిత్రలో ఎప్పుడూ లేదనీ ఇప్పటికైనా మేలుకుని వృథాని తగ్గించకపోతే తీవ్రపరిణామాలు ఎదురవుతాయనీ హెచ్చరిస్తున్నారు సామాజికవేత్తలు.
ఇంతగా ఆహారం ఎక్కడ వృథా అవుతోంది?
ఒక్కచోట కాదు, రైతు పొలంలో మొదలుపెట్టి వివిధ రూపాల్లో ప్రాసెసింగ్ జరిగి తినడానికి తయారుగా మారి మనిషి కడుపు నింపేవరకూ పలుదశల్లో ఆహారం వృథా అవుతోంది. గిట్టుబాటు ధర లేక రైతులు టన్నుల కొద్దీ కూరగాయల్ని పారేయడం చూస్తుంటాం. భద్రంగా దాచేందుకు తగిన గోదాములు లేక లక్షల టన్నుల ధాన్యం వానలో తడిసి పాడైపోతుంటుంది. కోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేక 30 శాతం పండ్లూ కూరగాయలూ వినియోగదారుల్ని చేరకముందే కుళ్లిపోతున్నాయి. ప్రాసెసింగ్‌లో, ప్యాకేజింగ్‌లో, రవాణాలో జరిగే ఆహార పదార్థాల వృథా తక్కువేమీ కాదు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా తినదగిన ఆహారం వృథా అయ్యేది మాత్రం- వంటిళ్లలో, హోటళ్లలో, విందు భోజనాల్లోనూ... ఈ వృథాలో మాత్రం ప్రతి ఒక్కరి పాత్రా ఉంటుంది.
మిగిలిపోయిన, పాడైపోయిన ఆహారాన్ని మరేం చేస్తాం?
ఎంత రుచికరంగా వండుకున్నా ఆహారపదార్థాలు కుళ్లిపోతే వాటిని ముట్టుకోలేం. ఆ వాసనే భరించలేం. ముందు చెత్తబుట్టలో పడేసి దాన్ని తీసుకెళ్లి వీధిలో పెడతాం. వీధిలో చెత్త ఊరి బయటకు వెళ్తుంది. మన కళ్లముందు కనబడదు కాబట్టి ఇక దాని గురించి మనం పట్టించుకోం. అంతమాత్రాన అక్కడ అదేమీ మాయమైపోదు. కుళ్లిపోయి మీథేన్ వాయువును తయారుచేస్తుంది. ఆ వాయువు మన చుట్టూ ఉన్న వాతావరణంలో కలిసిపోతుంది. కుప్పల్లోకి చేరుతున్న చెత్తలో 60 శాతం తడి చెత్తే. అంటే కుళ్లిపోయిన, ఎండిపోయిన కూరగాయలూ పండ్లూ, వండిన ఆహార పదార్థాలూ, ఎక్స్‌పైరీ టైమ్ అయిపోయిన బ్రెడ్లూ ఇతర బేకరీ ఉత్పత్తులూ తదితరాలు. ఇవన్నీ చెత్తకుప్పలో చేరి నాశనమయ్యే క్రమంలో చుట్టూ ఉన్న భూమినీ జలవనరుల్నీ కలుషితం చేస్తాయి. పాడైపోయిన ఆహారాన్ని దూరంగా పారేశామని మనం అనుకుంటాం కానీ ఎటు తిరిగీ వాటి ప్రభావం మళ్లీ మన మీదే పడుతుందని గుర్తించడం లేదు.
మరో దారేముంది?
పారేయాల్సిన పరిస్థితే రాకుండా చూసుకోవాలి. చిన్నప్పుడు కింద మెతుకు పడకుండా తినాలనీ, పళ్లెంలో అన్నం వదిలేయకూడదనీ పెద్దలు చెప్పేవారు. పిల్లలు అనుసరించేవారు. ఇప్పుడు పిల్లలూ పెద్దలూ అని తేడా లేకుండా ఆహారాన్ని వృథా చేయటంలో అందరి పాత్రా ఉంటోంది. పల్లెల్లో అయితే మిగిలిపోయిన ఆహారాన్ని పశువులకు వేస్తారు. పట్టణాల్లో ఆ అవకాశం ఉండదు. ఎక్కువ ఆహారపదార్థాలు వృథా అవుతున్నది కూడా పట్టణాలూ నగరాల్లోనే. అందుకని ప్రతి దశలోనూ వృథాని అరికట్టేందుకు ఏం చేయాలంటే...
వండేటప్పుడు: ఒకప్పుడు కట్టెలపొయ్యి మీద వంట చేయడానికి చాలా సమయం పట్టేది. అందుకని వేళకాని వేళ ఎవరైనావస్తే ఉంటుందని అన్నం ఎక్కువ వండేవారు. మిగిలినా రెండో పూట తినడమో, పశువులకు వేయడమో చేసేవారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్వూ కుక్కర్ల వల్ల పది నిమిషాల్లో వేడి వేడి అన్నం సిద్ధమైపోతోంది. కాబట్టి ఏపూటకాపూట చాలినంతే వండుకుంటే పారేసే పరిస్థితి రాదు. ఎప్పుడైనా ఒకసారి వండిన పదార్థాలు అనుకోకుండా మిగిలిపోతే వృథాగా పారెయ్యకుండా రెండో పూట వినియోగించుకోవాలి. లేదా ఎవరికైనా ఇచ్చేయాలి.
వడ్డించుకునేటప్పుడు: ఇంట్లో అయినా, విందులో అయినా అవసరమైనంతే వడ్డించుకోవటమూ వడ్డించుకున్నవన్నీ తినటమూ అలవాటు చేసుకుంటే పారేసే అవసరం రాదు. ఫలానా వంట నచ్చుతుందో లేదో అనుకున్నప్పుడు ముందు ఒక్క గరిటె వడ్డించుకుని రుచి చూసి నచ్చితేనే మళ్లీ పెట్టుకోవాలి. విందు భోజనాల్లో అక్కడ ఉన్నవన్నీ రుచి చూడాలన్న తాపత్రయంతో పళ్లాన్ని నింపుకోగలం కానీ వాటికి పొట్టలో చోటు ఇవ్వలేం. అందుకని నచ్చిన కొన్నిరకాలనే కొద్ది కొద్దిగా పెట్టుకుని కడుపు నిండా తింటే సమస్యే లేదు.
కొనేటప్పుడు: ఒకప్పుడు ఇంటికి కావలసిన సరకుల్ని లిస్టు రాసుకుని కిరాణా కొట్టుకెళ్లి అవి మాత్రమే తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు ఏ ఆఫీసు నుంచో వస్తూ సూపర్‌మార్కెట్‌కి వెళ్లి కన్పించినవన్నీ కొనుక్కోవటం, ఆఫర్లు ఉన్నాయని అవసరం లేని వాటిని కూడా తీసుకోవడం- చాలామంది చేస్తున్న వృథా వ్యయం.
అలా తెచ్చినవి ప్యాకెట్లు విప్పకుండానే ఎక్స్‌పైరీ డేట్లు దాటిపోవడం చెత్తబుట్టలోకి చేరడం కొన్ని ఇళ్లలో చాలా సాధారణ విషయం. కూరగాయలూ పండ్ల లాంటివి ఫ్రిజ్‌లో పెట్టినా కొన్ని రోజులే తాజాగా ఉంటాయి. అందుకని ఆహారపదార్థాల్ని కొనేటప్పుడు జాగ్రత్త పడితే వృథా తగ్గడమే కాదు డబ్బూ ఆదా అవుతుంది.
నిల్వ చేసినప్పుడు: కొన్న, తయారుచేసుకున్న ఆహారాన్ని ఒకసారి వాడాక మిగిలింది మరోసారి వాడుకోవచ్చని దాచిపెట్టుకుంటాం. అలా దాచినప్పుడు రెండు మూడు రోజుల్లో తీసి వాడేయాలి. కానీ పనులలో పడి కొందరు మర్చిపోతే, ఫ్రిజ్‌లోకీ బీరువాలోకీ చూసే తీరికా అలవాటూ లేక కొందరు మర్చిపోతారు. అలా ఆ పదార్థం వారం పదిరోజుల తర్వాత చెత్తబుట్ట చేరుతుంది. పప్పులూ పిండీ లాంటివి చాలాకాలం నిలవుంటే
పురుగుపడతాయి, పారేస్తాం. అదే తక్కువ మొత్తంలో కొని ఎప్పటిదప్పుడు వాడేస్తే సమస్యే ఉండదు.
హోటల్‌లో: హోటల్‌కి వెళ్లినప్పుడు కొత్త పదార్థాలు రుచి చూడాలనుకోవడం సహజం. అంతమాత్రాన ఫుల్‌ప్లేట్లు ఆర్డరిచ్చేసి తర్వాత అవి బాగోకపోతే వదిలేయడం డబ్బునీ ఆహారాన్నీ రెండిటినీ వృథా చేయడమే. తినాలనుకున్న పదార్థాల వివరాలు అడిగి కొద్దిగా తెప్పించుకుని రుచి చూడటం ఒక పద్ధతి. లేదంటే ఆ హోటల్‌లో ఏవి బాగుంటాయో తెలుసుకుని వెళ్లడం మరో పద్ధతి. ఇక పదార్థాలు బాగుండి తిన్న తర్వాత కూడా కొంత మొత్తం మిగిలిపోతే- దాన్ని ప్యాక్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఏమన్నా అనుకుంటారేమోనని మొహమాటపడితే వాళ్లు దాన్ని చెత్తబుట్టలో పారేస్తారు.
కొన్ని హోటళ్ళలో అన్నం వదిలేస్తే జరిమానా వేస్తారట. పదార్థాలు నచ్చకపోతే మన తప్పా?
నిజమే, హోటళ్లలో ఆహారం వృథా ప్రస్తావన ఈనాటిది కాదు. పలు దేశాల్లో హోటళ్లు ఇలాంటి ప్రయత్నాలు కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలు ఫలించాలంటే వినియోగదారులకు జరిమానా వేయడమే కాదు హోటళ్లూ తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాలి- అంటున్నారు నిపుణులు. ఎందుకంటే హోటళ్లలో 40 శాతం ఆహారం వృథా అవుతోందని 2016లో చేపట్టిన ఓ సర్వే చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు అసలు తినని ఆహారం కోసం ఖర్చు పెడుతున్నామనీ, అందులో రెండొంతులు వినియోగదారుల సొమ్మేననీ ఈ సర్వే పేర్కొంది. ఆ మధ్య రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ అమెరికన్ హోటల్ అండ్ లాడ్జింగ్ అసోసియేషన్‌తో కలిసి ఓ ప్రయోగం చేసింది. పది ప్రముఖ హోటళ్లలో ఏయే దశల్లో ఆహారం వృథా అవుతోందో పరిశీలించి, నివారణ చర్యలు తీసుకోగా కేవలం 12 వారాల్లోనే 38 శాతం వృథాని అరికట్టగలిగారు. మొత్తంగా హోటల్ పరిశ్రమ ఈ దిశగా చర్యలు తీసుకుంటే లక్షల టన్నుల ఆహార వృథాను అరికట్టడానికి ఎంతో కష్టపడనక్కరలేదంటారు ఈ అధ్యయనం చేసిన నిపుణులు. సింగపూర్ హోటళ్లు ఈ దిశగా మంచి ప్రయోగాలు చేస్తున్నాయి. ఒక హోటల్ స్వయంగా కంపోస్టు ఎరువు తయారుచేసి తమ కూరగాయల తోటకే వినియోగిస్తోంటే, మరో హోటల్ వాడిన నూనెతో బయోడీజిల్ తయారుచేసి కార్లు నడుపుతోంది. అక్కడి ఫుడ్‌బ్యాంక్ అయితే హోటళ్లలో మిగిలిపోయిన పదార్థాలను ఎప్పటికప్పుడు సేకరించి పేదలకు పంచుతుంటుంది.
వేడుకల్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఏం చేయగలం?
రోజువారీ వంటకాలంటే మిగలకుండా పొదుపుగా చేసుకోవచ్చు. కానీ వేడుకలప్పుడు అది మన చేతిలో ఉండదు. అందుకని రాబిన్‌హుడ్ ఆర్మీ, ఫీడింగ్ ఇండియా లాంటి స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంపై పనిచేస్తున్నాయి. మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి అవసరమైనవారికి పంచే బాధ్యత చేపడుతున్నాయి. స్థానికంగా ఉండే అలాంటి సంస్థల గురించి తెలుసుకుని ముందే సమాచారం ఇవ్వాలి. అప్పుడు మన వేడుక ముగియగానే- అంటే ఆహారం పాడవకముందే వారు దాన్ని తీసుకెళ్లి పంచే బాధ్యత చేపడతారు. ఇక పాడైపోయిన ఆహారపదార్థాల్ని ఇళ్లవద్దే కంపోస్ట్ తయారీకి వాడుకోవచ్చు. అలా చేయడానికి వీలుకానివాళ్లు తడి, పొడి చెత్తను విడివిడిగా పారేయడం అలవాటు చేసుకుంటే మున్సిపాలిటీ వాళ్లు దాన్ని రీసైకిల్ చేయడానికి వీలవుతుంది.
* * * * * * * * * * * * * * *
ప్రతి ధాన్యం గింజమీదా తినేవారి పేరు రాసిపెట్టి ఉంటుందని నమ్మే సంస్కృతి మనది. అలాంటిది ఎవరూ తినకుండా కోట్ల విలువ చేసే ఆహారం చెత్తకుప్ప పాలవుతోందంటే ఆ ధాన్యం గింజల మీద ఎవరి పేరూ రాసి లేదని కాదు, మన అజాగ్రత్త కారణంగా చేతులారా ఆ పేర్లు చెరిపేస్తున్నామని అర్థం. అందుకే ఇకనైనా, ఆ పేర్లు చెరిగిపోకుండా చూస్తామనీ అలా కొందరి ఆకలైనా తీరుస్తామనీ సంకల్పం చెప్పుకుందాం... అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా మరి!
ఫీడింగ్ ఇండియా... ఓ కుర్రాడి ఆలోచన! నాలుగేళ్ల క్రితం 22 ఏళ్ల అంకిత్ కవాత్రా ఓ పెళ్లికి వెళ్లాడు. అక్కడ 35 రకాల వంటకాలు వడ్డించారు. అన్ని పదార్థాలను అందరూ ఎలా తింటారో చూడాలన్న ఉత్సుకతతో పెళ్లి సంగతి మర్చిపోయి అంకిత్ భోజనాలు చేస్తున్నవాళ్లనే గమనించాడు. పది ప్లేట్లలో ఎనిమిది సగం ఆహారంతో చెత్తబుట్టలోకి చేరుతున్నాయి. అంత ఆహారం వృథాకావటం చూసి అతని మనసు చివుక్కుమంది. ఆ తర్వాత వీధిలో అడుక్కునేవాళ్లను చూసినప్పుడల్లా ఆ దృశ్యమే గుర్తొచ్చేది. స్నేహితులతో ఆ విషయం చర్చించగా ఓ ఆలోచన వచ్చింది. తర్వాత మరో పెళ్లికి వెళ్లినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టారు. వాళ్లందరూ అక్కడి పెద్దలతో మాట్లాడి మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకుని కార్లలో రాత్రంతా తిరుగుతూ 500 మందికి పంచారు. ఆ సంఘటనతో అంకిత్‌కి తన మీద తనకి నమ్మకం వచ్చింది. చేస్తున్న ఉద్యోగం మానేసి 'ఫీడింగ్ ఇండియా' అనే సంస్థను పెట్టాడు. ఎవరైనా సరే ఆహారం మిగిలిపోయినప్పుడు ఆ సంస్థకు ఫోన్ చేస్తే వలంటీర్లు వచ్చి తీసుకెళ్లి పేదలకు పంచుతారు. నాలుగేళ్లలోనే దేశంలోని 65 నగరాలకు విస్తరించిన ఈ సంస్థ ఇప్పటికే రెండు కోట్ల మంది ఆకలి తీర్చింది. దాదాపు 9వేల మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. ఫీడింగ్ఇండియా.ఇన్ వెబ్‌సైట్‌లో చూసి ఏయే నగరాల్లో ఈ సంస్థ సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. |
ఇవీ లెక్కలు! వృథా అవుతున్న గోధుమలు: 2 కోట్ల 10 లక్షల టన్నులు. పండిన పంట గోదాములకు చేరేలోపు జరుగుతున్న నష్టం: రూ. లక్ష కోట్లు. రోజూ ఆకలితో ఉంటున్న భారతీయులు: దాదాపు 20 కోట్లు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లోనూ మనది తీవ్రంగా పరిగణించాల్సిన స్థానమే. దేశ జనాభాకి అవసరమైనంత పండిస్తున్నా ఇన్ని కోట్ల మంది ఆకలితో ఉండడానికి కారణం ఏటా 40 శాతం ఆహారం వృథా కావడమే. వృథా తగ్గితే డిమాండూ ధరా తగ్గుతాయి. సరఫరా పెరుగుతుంది. అందరికీ చాలినంత ఆహారం దొరుకుతుంది. |
ప్రయాణం... నేర్పిన పాఠం! తరచుగా ప్రయాణాలు చేసే విషభ్ మెహతా ఫ్లైట్‌లో ఇచ్చే ఆహారాన్ని చాలామంది తినకుండా వదిలేయడం చూశాడు. ఓసారి ముంబయి నుంచి జైపూర్‌కి వెళ్తున్నప్పుడు అలా మిగిలిపోయిన ఆహారం ఏమవుతుందని సిబ్బందిని అడిగాడు. ఒకసారి సర్వ్ చేసిన ఆహారాన్ని పాకెట్లను విప్పకపోయినా సరే చెత్తబుట్టలోనే పడేస్తామని వారు చెప్పడంతో వాడని పదార్థాలను విడిగా సేకరించి పెట్టమని కోరాడు. అలా తీసిపెట్టగా ఆ ఒక్క ప్రయాణంలోనే 70 బర్గర్లు, 50 వెన్న పాకెట్లు, 30 చాకొలెట్లు వచ్చాయి. విషభ్ వాటిని తీసుకెళ్లి బిచ్చగాళ్లకు పంచాడు. ఆ విషయాన్ని మర్నాడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఎయిర్ఇండియా విమానంలో చిన్న ప్రయాణంలోనే ఇంత ఆహారం వృథా అయితే ఇక అంతర్జాతీయ విమానాల్లో సుదీర్ఘ ప్రయాణాలప్పుడు ఇంకెంత ఆహారం వృథా అవుతుందీ, దాన్ని సేకరిస్తే ఎంతమంది నిరుపేదల ఆకలి తీర్చవచ్చూ అంటూ లెక్కలేశాడు. సగటున ప్రపంచవ్యాప్తంగా రోజుకు లక్ష విమానాలు తిరుగుతాయనుకుంటే వాటిల్లో ఎంత ఆహారం వృథా అవుతుందో చూడండి... దయచేసి ఆహారం వృథా చేయకండి- అంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాడు. మెహతా ఫేస్‌బుక్ పోస్టుని పాతిక వేల మంది షేర్ చేశారట. 'అలా షేర్ చేసిన వాళ్లంతా నా ఆవేదన అర్థం చేసుకుంటే చాలు... మార్పు మొదలవుతుంది' అంటాడతను.This article is taken from eenADu newspaper Forwarded by vikrambhayya@gmail.com 8500386163 |
No comments:
Post a Comment