Sunday, May 5, 2019

ఈనాడు పత్రిక.. నీటిని గౌరవించాలని ‘చిత్రం’గా చెప్పారు

  • నీళ్లొస్తున్నాయ్‌.!' పిలుపో అరుపో తెలియని ఈ మాట వినపడటం ఆలస్యం- ఇళ్లల్లో హడావుడి మొదలవుతుంది. బిందెలూ బకెట్లూ నల్లాల దగ్గర బారులు తీరుతాయి. వేసవిలో నీటి ఎద్దడి ఏటా ఉండే సమస్యేనని అందరికీ తెలుసు. మరి వచ్చే ఏడైనా తగ్గించుకోడానికి ఏమైనా చేస్తున్నామా అంటే- సమాధానం ఉండదు. నీళ్లు ఉన్నప్పుడు అవసరం గడుపుకోవటమూ లేనప్పుడు ఆందోళన చెందటమే కానీ ఆ తర్వాత దాని గురించి ఆలోచించే అలవాటు ఎవరికీ ఉండటం లేదని సుతిమెత్తగా ఎత్తిచూపారు కొందరు సృజనశీలురు.  నీరు లేకపోతే అల్లల్లాడిపోయే మనిషి అది అందుబాటులో ఉన్నప్పుడు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాడో... మూడు, నాలుగు నిమిషాల లఘుచిత్రాల్లో మనసుకు హత్తుకునేలా చెప్పారు. నీటి సమస్యను అర్థం చేసుకోవడానికి భాషతో పనిలేదంటూ అతి తక్కువ సంభాషణలతో . ఆ పాత్రల్లో మనమూ ఉన్నామేమో చూసుకుందామా మరి





వచ్చేదాకా ఎదురుచూపులు... 


నీళ్లు వచ్చేదాకా నీళ్లు లేవు, ఇంకా నల్లా రాలేదు, పనులేవీ అవలేదు... అంటూ నిట్టూర్పులు విడుస్తారు. ఇంట్లోకీ బయటికీ అసహనంగా తిరుగుతూ ఎదురుచూసిన వారే తీరా నీళ్లొచ్చాక ఏం చేస్తారో 'వాటర్‌మ్యాన్‌' అనే లఘుచిత్రం సరదాగానూ భుజాలు తడుముకునేలానూ చెబుతుంది. నీళ్లు కావాలంటే నల్లా తిప్పడం మనకు అలవాటు. అందుకే సింబాలిక్‌గా మున్సిపాలిటీ సరఫరా చేసే నల్లా నీటికి ఒక మనిషి రూపం ఇచ్చి, అతని నోటికే పైపు బిగించారు. ఆ కాలనీలో నిత్యం గంట మాత్రమే వాటర్‌మ్యాన్‌ ఉంటాడు. ఓ కుటుంబంలో అందరూ ఇంకా నల్లా రాలేదా... అంటూ ఒకరిని ఒకరు అడుగుతూ అసహనంగా తిరుగుతుంటారు. అంతలో నీళ్లొస్తున్నాయ్‌... అంటూ అరుపులు వినపడతాయి. అందరూ గబగబా నల్లాలు తిప్పేసి పనులు మొదలెడతారు. నల్లా వచ్చేదాకానే ఆరాటం. నీళ్లు కనపడగానే మళ్లీ అందరూ మామూలు మనుషులైపోతారు. వంటింటి సింకులో పంపు నుంచి నీరు పోతూ ఉంటాయి, ఆమె పొయ్యి దగ్గర పనిచేసుకుంటూ ఉంటుంది. ఆయన వాష్‌బేసిన్‌లో పంపు తిప్పేసి తాపీగా షేవింగ్‌ చేసుకుంటూ ఉంటాడు. మరొకరు బాత్‌రూములో బట్టలు ఉతకడానికి బకెట్‌ పంపు కింద పెట్టి ఫోనులో ముచ్చటపెడతారు. అందరూ బిజీగా పనిచేసుకుంటున్నట్లే కానీ మూడుచోట్లా వృథాగా పోతున్న నీటిని ఎవరూ పట్టించుకోరు. 'వాటర్‌మ్యాన్‌'కి కోపం వస్తుంది. మర్నాడు ఆ ఇంటివైపు వెళ్లడు. నీళ్లు తమకు ఎందుకు రావడంలేదో తెలియక ఇంటివారు బిక్కమొహం వేసుకుని చూస్తుంటారు. నిన్న అదే సమయంలో నీళ్లు వస్తున్నప్పుడు తాము ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందీ గుర్తొచ్చి సిగ్గుపడతారు. 'నీరు చాలాదూరం ప్రయాణించి మన ఇంటివరకూ వస్తుంది... దాన్ని గౌరవించండి' అన్న నినాదంతో చిత్రం ముగుస్తుంది.

ఏది ముఖ్యం?

సంప్రదాయమా... అవసరమా- ఏది ముఖ్యం; అసలు సంప్రదాయం అంటే ఏమిటి- అన్న ఆలోచన రేకెత్తిస్తుంది ఈ మూడు నిమిషాల చిత్రం. అన్ని మతాచారాల్లోనూ సంప్రదాయాల్లోనూ నీటి పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. పొద్దున్న లేచినప్పటినుంచి దేవుడికీ అంజలి అనీ అభిషేకమనీ తీర్థమనీ రకరకాలుగా నీటిని వాడుతూనే ఉంటాం. అలాంటి ఓ సందర్భాన్ని లఘుచిత్రంగా మలచిన తీరు ఇది. ఓ కరవుపీడిత గ్రామంలో ఊరి బయట దేవాలయంలో పూజారి పూజకు ఉపక్రమిస్తాడు. ఎండిపోయిన తులసి మొక్క మీద నాలుగు చుక్కల నీళ్లు చిలకరించి తులసిపూజ అయిందనిపిస్తాడు. ఆ సమయంలో గుడి పక్కనే ఉన్న నల్లా దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వస్తుంది ఓ బాలిక. నల్లా తిప్పితే నీళ్ల బదులు బుస్సుమని గాలి చప్పుడు వస్తుంది. ఆమె నిరాశతో వెనుతిరగడం చూస్తాడాయన. తన దగ్గర బిందెలోనూ కొద్దిగానే నీళ్లుంటాయి. వాటిని చెంబులో పోసుకుని గుడిలోకి వెళ్తాడు. ఆ చెంబుడు నీళ్లతో దేవుడికి అభిషేకం చేయబోతూ ఆగి ఆలోచనలో పడతాడు. అభిషేకం చేయకుండా ఉత్తరీయాన్ని తడిపి ఆ తడిబట్టతో విగ్రహాన్ని తుడిచి దండం పెట్టుకుంటాడు. చెంబులో ఉన్న నీళ్లు తీసుకెళ్లి ఎండిపోయిన తులసి మొక్కకు పోస్తాడు. 'సంప్రదాయం' అంటే ఆలోచనారహితంగా ఆచరించేదికాదనీ, ఆగిపోకుండా ముందుతరాలకు అందాల్సినదనీ చెబుతున్నట్లుగా ఎండిన తులసి మొక్కను చిగురింపజేసే ప్రయత్నంతో చిత్రం ముగిస్తారు. చిత్రం పేరు- ద రిచ్యువల్‌.

నువ్వంటే నువ్వంటూ...

బ్యాచిలర్స్‌ రూమ్‌... ఇద్దరు కుర్రాళ్లు పడుకుని ఫోనుల్తో బిజీగా ఉంటారు. ఇంతలో నల్లాలో నీళ్లు వస్తాయి. వంటింటి సింకులో పంపు తిప్పేసి ఉండటంతో నీళ్లు వృథాగా పోతుంటాయి. వెళ్లి పంపు కట్టెయ్యమని ఒకరు ఇంకొకరికి చెబుతారు. 'నేను గేమ్‌ ఆడుతున్నాను, ఇప్పుడు ఆపడానికి వీలు కాదు, నువ్వే వెళ్లు' అంటాడు తలెత్తకుండానే రెండో కుర్రాడు. 'నేనేం ఖాళీగా లేను చాటింగ్‌ చేస్తున్నా, నువ్వే వెళ్లి కట్టెయ్యి' అంటాడు మొదటి కుర్రాడు. 'ఎప్పుడూ ఇంతే. పనులన్నీ నాకే చెబుతావు. నేను చెయ్యనంటే చెయ్యను...' అంటాడు రెండో కుర్రాడు. ఇద్దరూ కాసేపు గొడవపడి అలాగే పడుకుని నిద్రపోతారు. వంటింట్లో నీళ్లు పోతూనే ఉంటాయి. కాసేపటికి మొదటి కుర్రాడు లేచి నీళ్లు తాగుదామని చూస్తే బాటిల్‌లో నీళ్లుండవు. ఇంట్లో ఎక్కడా నీళ్లు కన్పించవు. కొనుక్కుందామని వెళ్తే అన్ని దుకాణాల్లోనూ నీళ్లు అయిపోయాయంటారు. దాంతో నీటి కోసం వెతుకుతూ వెళ్లి కళ్లు తిరిగి పడిపోతాడు. అదంతా కల... నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేస్తాడు మొదటి కుర్రాడు. వంటింట్లో నీళ్లు పోతూనే ఉంటాయి. గబగబా వెళ్లి పంపు కట్టేస్తాడు. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలోనూ ఒకరికి మంచినీళ్లు దొరకడం లేదనీ, పల్లెల్లో మహిళలు రోజుకు కొన్ని గంటలు నడిస్తే కానీ తాగడానికి బిందెడు నీళ్లు దొరకవనీ ఎక్కడో చదివింది గుర్తొచ్చి ఆలోచనలో పడతాడు. వాదులాడుకుంటూ పంపు కట్టెయ్యకుండా నీటిని వృథా చేసినందుకు పశ్చాత్తాపపడతాడు. నీటిని కాపాడుకోవటం అంటే మనని మనం కాపాడుకోవటమేనంటూ ముగుస్తుంది 'సేవ్‌ వాటర్‌, సేవ్‌ యువర్‌ సెల్ఫ్‌' అనే ఈ లఘుచిత్రం.

ఆ మ్యాజిక్‌ తెలియదు, అందుకే...

క యువకుడు కారు కడగడానికి వాకిట్లోకి వస్తాడు. నల్లాకి పైపు బిగించి దాంతో కారు కడగడం మొదలెడతాడు. అంతలో జేబులో ఫోను మోగుతుంది. స్నేహితుడితో క్రికెట్‌ మ్యాచ్‌ గురించి కబుర్లు చెబుతూ పైపుని అలా వదిలేస్తాడు. నీరంతా వృథాగా పోతుంటుంది. వీధిలో ఇద్దరు పేద పిల్లలు నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతూ వస్తారు. గేటు కింది నుంచి వృథాగా పోతున్న నీరు చూసి లోపలికి తొంగిచూస్తారు. ఫోను మాట్లాడుతున్న యువకుడు ఆ పిల్లల్ని చూసి తన చేతిలోని పైపును చూసుకుంటాడు. ఫోను పెట్టేసి వాళ్లను లోపలికి రమ్మంటాడు. వాళ్లు ఆనందంగా గేటు తీసుకుని లోపలికి వచ్చి నీళ్లు పట్టుకోబోయేసరికి నల్లా ఆగిపోతుంది. నిరాశచెందిన పిల్లల్ని ఉండమనిచెప్పి లోపలికి వెళ్లి మరో పైపు తెస్తాడు. ఆ పైపు అప్పటివరకూ కింద వృథాగాపోయిన నీళ్లన్నిటినీ వెనక్కి బకెట్‌లోకి తెస్తుంది. ఆ నీటిని ఆ పిల్లల బిందెల్లో నింపుతాడు. వాళ్లు సంతోషంగా వెళ్లిపోతారు. బకెట్లో మిగిలిన కొద్ది నీళ్లలో బట్ట తడిపి ఆ యువకుడు కారు తుడవడం మొదలెడతాడు. 'ఇలాంటి మ్యాజిక్‌ పైప్‌ ఉంటే బాగానే ఉంటుంది. కానీ లేదు. అందుకని నీటిని వృథా చేయకుండా జాగ్రత్తపడదాం'... అంటూ ముగుస్తుంది 'ద మ్యాజిక్‌ పైప్‌' అనే లఘుచిత్రం.


నీటికి రంగుందా?

ఓ చిన్నారి బడికెళతాడు. టీచరు నీటి గురించి పాఠం చెబుతుంది. పాఠం వినకుండా పక్క వాళ్లతో మాట్లాడుతున్న చిన్నారిని పిలిచి నీటికి నిర్వచనం చెప్పమంటుంది. అబ్బాయి బిక్క మొగం వేస్తాడు. ఇంటి దగ్గర చదువుకుని రమ్మని కోప్పడుతుంది. ఆ రోజు రాత్రి కూర్చుని పాఠం అంతా వల్లెవేస్తాడు. ఉదయం లేచి ముఖం కడుక్కోవడానికి నీళ్ల కోసం వెతికితే ఎక్కడా ఉండవు. ఓ బిందెలో ఉన్న కాసిన్ని నీళ్లు మగ్గులో పోసుకుంటాడు. వాటితోనే ముఖం కడుక్కుని తయారై మళ్లీ బడికెళతాడు. టీచరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ 'నీటికి రుచి లేదు, వాసన లేదు, రంగు... ఉంది' అంటూ ఆగుతాడు. పొద్దున్న తాను ముఖం కడుక్కునేటప్పుడు మగ్గులో నీరు నల్లగా ఉన్న విషయం గుర్తొస్తుంది. 'నీరు నల్లగా ఉంటుంది' అని చెప్పేస్తాడు. నీటిని 'రంగులేని బంగార'మని మనం అనుకుంటాం. 'బ్లూ గోల్డ్‌' అని పాశ్చాత్యులు కవిత్వం రాసుకుంటారు కానీ నిజానికి ప్రపంచంలో 85 కోట్ల మందికి (అందులో 16 కోట్లు మనదేశంలోనే) శుభ్రమైన రంగులేని తాగునీరు అందుబాటులో లేదని చెప్పడానికి తీసిందే 'కలర్‌ ఆఫ్‌ వాటర్‌' అనే ఈ చిన్ని చిత్రం. 'వియ్‌ ఆర్‌ వాటర్‌' ఫౌండేషన్‌ అవార్డునీ అందుకుంది ఈ చిత్రం.

పిల్లలే... అర్థం చేసుకున్నారు!

 పేద కుటుంబం కరవు ప్రాంతం నుంచి నగరానికి వలస వచ్చింది. ఓ మురికివాడలో కూలిపోయిన ఓ ఇంటి గోడవారగా నీడ ఏర్పాటుచేసుకుని ఉంటున్న ఆ కుటుంబానికి తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకవు. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లలో పిల్లలంతా హోలీ ఆడుకోవడం చూసి అక్కడికి వెళ్తాడు వీళ్ల అబ్బాయి. ఆ పిల్లలు రంగు కలుపుకోవడం కోసం నీళ్ల ప్యాకెట్లన్నీ ఓ బకెట్లో వేసి పెట్టుకుంటారు. అది చూసిన అబ్బాయి వాళ్లు చూడకుండా కొన్ని ప్యాకెట్లు చొక్కాలో దాచుకుని పరుగున ఇంటికి తీసుకెళ్తాడు. ఆడుకుంటున్న పిల్లలు అది చూడనే చూస్తారు. రంగులు ఆడుకోవడానికే ఆ అబ్బాయి నీళ్ల ప్యాకెట్లు పట్టుకెళ్లాడనుకున్న ఆ పిల్లలు ఆ అబ్బాయికి రంగులు కూడా ఇద్దామనుకుంటారు. మళ్లీ అతడు వచ్చేసరికి రంగు కలిపిన నీళ్ల పాకెట్లు ఆ బకెట్లో ఉంచి మంచి నీళ్ల ప్యాకెట్లను తమ దగ్గర ఉంచుకుని అతడికి కనపడకుండా దాక్కుని చూస్తుంటారు. రంగు నీళ్లు చూసి అబ్బాయి నిరాశగా వెళ్లిపోతాడు. 
ఆ అబ్బాయి రంగునీళ్లు ఎందుకు తీసుకోలేదో అర్థంకాని అపార్ట్‌మెంట్‌ పిల్లలు శబ్దం చేయకుండా అతని వెనకాలే వెళ్తారు. అక్కడ ఆ అబ్బాయి ముందు పట్టుకెళ్లిన ప్యాకెట్ల నీటితో వాళ్లమ్మ పిండి కలుపుతుంటుంది. మరో ప్యాకెట్‌ నీటిని అతడి తమ్ముడు తాగుతూ ఉంటాడు. ఆ అబ్బాయి రంగులతో ఆడుకోవడానికి కాక వాడుకోవడానికీ, తాగడానికే ఆ నీళ్లు తీసుకెళ్లాడని అర్థమై ఆశ్చర్యపోతారా పిల్లలు. ఆడుకోవడానికి తాము తెచ్చుకున్న నీటి ప్యాకెట్లన్నీ ఆ పిల్లవాడికి ఇచ్చేస్తారు 'సెలెబ్రేషన్‌ ఆఫ్‌ థర్‌స్ట్‌' అనే ఈ లఘుచిత్రంలో.

ఎకరాలు ఎన్ని ఉన్నా...

రోజు ఉదయం పొలం వెళ్లిన షేర్‌సింగ్‌ తన స్నేహితుడైన రతన్‌లాల్‌కి ఫోన్‌ చేస్తాడు. అతడు తాను పంచాయతీ ఆఫీసుకు వెళ్తున్నాననీ అక్కడ ఆధునిక వ్యవసాయ విధానాల గురించి శిక్షణ ఇస్తున్నారనీ చెబుతాడు. 'నీకూ ఆ పిచ్చి పట్టిందా, ఒకసారి నా పొలం దగ్గరికి రా, నీతో మాట్లాడాలి' అంటాడు షేర్‌సింగ్‌. సరేనని వస్తాడు రతన్‌లాల్‌. షేర్‌సింగ్‌ చెట్టుకింద గట్టుమీద కూర్చుని టిఫిన్‌ తింటూ ఉంటాడు. రైతులు పొలమంతా పైపులు పెట్టి బిందు సేద్యం, తుంపర్ల సేద్యం అంటూ కొత్త పోకడలు పోతున్నారనీ అది చూస్తే తనకి చాలా చిరాకుగా ఉందనీ రతన్‌లాల్‌కి చెబుతాడు. 'బోర్లలో నీరు కాస్త తగ్గింది నిజమే, అంతమాత్రాన దేశం ఎడారి అయిపోలేదు కదా, ఈ విదేశీ సోకులు ఎందుకు మనకి' అని ప్రశ్నిస్తాడు. పచ్చిమిరపకాయను నంజుకుంటూ రొట్టెలు తింటున్న షేర్‌సింగ్‌కి నీటి విలువ తెలియజెప్పాలనుకున్న రతన్‌లాల్‌ అతడు చూడకుండా కింద ఉన్న మంచినీటి సీసాను పడేస్తాడు. మిర్చి కారంగా ఉండి మంట పుట్టగానే షేర్‌సింగ్‌ నీటి కోసం వెతుక్కుంటాడు. 'అయ్యో సీసాలో నీళ్లు పోయాయే' అనుకుంటూ లోపల బిందెలో చూస్తాడు. అదీ ఖాళీగా ఉంటుంది. బోర్‌ ఆన్‌ చేయబోతే కరెంటు ఉండదు. మంట తట్టుకోలేక కాలవలో మురికిగా ఉన్న నీళ్లే తాగబోతాడు. రతన్‌లాల్‌ అతడిని ఆపి తన సంచీలో ఉన్న నీళ్ల సీసా ఇస్తాడు. షేర్‌ సింగ్‌ తాగి చల్లబడ్డాక 'షేర్‌సింగ్‌, ఇక్కడ బోరు ఉన్నా సీసాలో, బిందెలో నీళ్లు ఎందుకు పెట్టుకున్నావు? కరెంటు లేకపోతే ఉంటాయనేగా. అలాంటి జాగ్రత్తే ఇది కూడా. మనం వాడుకోవటం వల్ల భూగర్భంలో నీళ్లు అయిపోతున్నాయి. వాటిని మళ్లీ భర్తీ చేస్తేనే మన మనవలకి నీళ్లుంటాయి. అవే లేకపోతే మనం ఎన్ని ఎకరాలు సంపాదించి ఇచ్చినా దండగే. ఆధునిక విధానాలు సోకు కోసం కాదు, ముందుతరాల కోసం నీటిని పొదుపు చేయటానికి. అందుకే వాటి గురించి తెలుసుకుందాం పద' అంటాడు రతన్‌లాల్‌. నీటి విలువ అర్థమైన షేర్‌సింగ్‌ స్నేహితుడితో కలిసి వెళ్తాడు.

ఒక్కోసారంతే... పక్కవాళ్లు ఎత్తి చూపితేగానీ మన పొరపాటు మనకు తెలియదు.
..  మనం అలాంటి పొరపాట్లు చేయకుండా ..

No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...