లద్దాఖ్ ప్రాంతంలో సగటు వర్షపాతం చాలా తక్కువ. అందుకే అక్కడి జనాలు వర్షాలని పెద్దగా నమ్ముకోరు. హిమాలయాల్లో ఉన్న గ్లేషియర్స్(మంచు నదులు)కరిగినప్పుడు వచ్చే నీటినే వివిధ అవసరాలకు వాడుకుంటారు. గోధుమలు, బార్లీ, యాపిల్ వంటి పంటలు పండించుకుంటూ ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తుంటారు. కొంతకాలంగా ఈ పర్వత ప్రాంతవాసులకు గడ్డుకాలమే నడుస్తోంది. భూతాపం కారణంగా అక్కడి మంచునదులు వేగంగా కరిగిపోతున్నాయి. దాంతో అయితే వరదలు... లేకపోతే కరవు అన్నట్టుగా ఉంది అక్కడి పరిస్థితి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లోనైతే నీటికోసం రైతుల మధ్య పెద్దపెద్ద పోరాటాలే జరుగుతాయి. వ్యవసాయ పనులు అన్నీ అయిపోయిన తర్వాత శీతకాలంలో మాత్రం హిమానీనదాల నుంచి వచ్చిన నీరు ఎవరికీ ఉపయోగపడకుండానే వృథాగా సింధునదిలో కలిసిపోతూ ఉంటుంది.
మంచు స్తూపాలు...
ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో రైతులు పంటలు పండించుకునేందుకు కావాల్సిన నీరు అందితే పర్వతప్రాంత వాసుల కష్టాలు గట్టెక్కుతాయి. కానీ నీరు అందించే హిమానీనదాలు భూతాపం కారణంగా వేగంగా కరిగిపోతున్నాయి. అలా కరిగిపోయిన వాటి స్థానంలో మనమే కృత్రిమంగా ఎందుకు గ్లేషియర్స్ లేదా మంచుకొండలు నిర్మించకూడదు అనుకున్నాడు విద్యావేత్త, ఇంజినీర్ అయిన సోనమ్‌వాంగ్‌చుక్. శీతకాలంలో వృథాగా నదుల్లో కలిసిపోతున్న నీటిని వాడుకుని వాంగ్‌చుక్ బృందం మంచుస్తూపాలు చేయడం మొదలుపెట్టింది.
ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి పారుతున్న నీటిని పాలిఎథిలిన్ ట్యూబుల ద్వారా కిందకు తీసుకొస్తారు. సహజంగా నీరు పల్లానికి వచ్చేటప్పుడు వేగంగా వస్తుంది కదా! ఆ వేగాన్ని వాడుకుని నీటిని స్ప్రింకర్ల సాయంతో పైకి ఎగజిమ్మేట్టు చేస్తారు. ఈ పనిని రాత్రిపూట మాత్రమే చేస్తారు. ఎందుకంటే... అప్పుడయితే వాతావరణం మరీ చల్లగా ఉంటుంది. అలా మైనస్ 30 డిగ్రీల దగ్గర ఎగజిమ్మిన నీరు బయటకు
రాగానే గాల్లోనే గడ్డకట్టేస్తుంటుంది. క్రమంగా అదో శంకు లేదా స్తూపం ఆకారాన్ని సంతరించుకుంటుంది. పైప్‌లైన్లలో నీరు గడ్డకట్టకుండా వాటిని భూమి అడుగు నుంచి వేస్తారు. స్తూపాలకున్న ప్రత్యేకమైన ఆకృతి మూలంగా అవి కొన్ని నెలల పాటు కరగకుండా అలానే మంచుకొండల్లా ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరిగే ఏప్రిల్, మేనెలల్లో ఈ స్తూపాలు క్రమంగా కరిగి దిగువన ఉన్న గ్రామ అవసరాలకు, పంటలకు కావాల్సిన నీరు అందిస్తాయి. ఈ నీటితోనే లావెండర్, వాల్‌నట్, యాపిల్, బార్లీ, గోధుమ పంటలని ఇక్కడ ప్రజలు పండిస్తున్నారు. విద్యుత్‌ని ఏమాత్రం ఉపయోగించుకుండా కేవలం గురుత్వాకర్షణ శక్తి, వేగం, ఒడుపు వంటి ప్రకృతి నియమాలని వాడుకునే ఈ విజయాన్ని సాధించింది వాంగ్‌చుక్ బృందం. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రయోగం ఫలితంగా ఇప్పటివరకూ కొన్ని వేల ట్యాంకర్లతో సమానమైన నీటిని ఇక్కడి ప్రజలు పొందగలిగారు.
* మంచుస్తూపాల ప్రయోగంతో హిమాలయాల్లోని వందల గ్రామాలు లబ్ధి పొందుతాయి. ప్రజలు సుభిక్షంగా ఉండటం కంటే కావాల్సిందేముంది అంటూ స్థానిక బౌద్ధ గురువు చేసాంగ్ రింపోచే ఈ ప్రాజెక్టుకు కావాల్సిన వందల ఎకరాల స్థలాన్ని పైగా అనే బౌద్ధ ఆరామం వద్ద కేటాయించారు. 5000 చెట్లను నాటించారు. ప్రపంచంలోని అనేకచోట్ల పర్వత ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ ప్రాజెక్టు ఓ పరిష్కారం అందిస్తుందని ప్రపంచం నమ్ముతోంది. అందుకే ఈ ప్రాజెక్టుకు కోట్లాది రూపాయల సీడ్‌ఫండ్ అందింది. క్రౌడ్‌ఫండింగ్ రూపంలో మరిన్ని నిధులు సేకరిస్తోంది
వాంగ్‌చుక్... మూడంటే మూడు గడపలున్న హిమాలయ ప్రాంతపు కుగ్రామంలో జన్మించాడు. చాలా సంవత్సరాల వరకూ స్కూల్ అంటే ఏంటో తెలియదు అతనికి. అమ్మనేర్పిన అక్షరాలే అతనికి దారి చూపించాయి. కశ్మీర్ వెళ్లి ఇంజినీరింగ్ చదివిన వాంగ్‌చుక్... పర్వతప్రాంత పిల్లల కోసం సెక్‌మాల్(స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లద్దాఖ్)పేరుతో స్కూల్‌ని స్థాపించాడు. అంతా దీన్ని స్కూల్ ఫర్ ఫెయిల్యూర్స్ అని పిలుస్తారు. వైఫల్యాల నుంచి విజయాలు సాధించే స్కూల్ ఇది. గ్లోబల్‌వార్మింగ్ వంటి సమస్యలకు వాస్తవ పరిష్కారాలని వెతికేందుకు ఈ బడిని వేదికగా మార్చాడు వాంగ్‌చుక్. పాతికేళ్ల క్రితం స్థాపించిన ఈ బడి ఇప్పుడు యూనివర్సిటీ ఫర్ ఫెయిల్యూర్స్‌గా మారింది. అనేక ఉపాధి అవకాశాలని చూపించే శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు.. ఈ స్కూల్ నుంచి ఎంతోమంది సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, కళాకారులు పుట్టుకొచ్చారు. ఐస్‌మాన్ ఆఫ్ లద్దాఖ్ అంటారు వాంగ్‌చుక్‌ని.
No comments:
Post a Comment